Tuesday, 3 November 2026

మద్యం ధరలతో నాటుసారా జోరు

గ్రామాల్లో అక్రమంగా చీప్‌ లిక్కర్‌
కడప,ఫిబ్రవరి26(జనం సాక్షి): మద్యం ధరలు పెంచడంతో నాటుసారా వాసన అక్కడక్కడా గుప్పుమంటోంది. దశల వారీ చర్యలతో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తామన్న ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచేసింది. ఇందులో చీప్‌ మద్యం ధరలు కూడా చుక్కల్లోకి చేరాయి. ధరలు పెరిగినా డిమాండ్‌ తగ్గలేదు. చీప్‌ మద్యం అందుబాటులో లేకపోయేసరికి వ్యసన పరుల బలహీనతను ఆసరా చేసుకుని కొన్నిచోట్ల సారా తయారీదారులు సరుకును అందుబాటులో ఉంచుతున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో దుకాణాలు దూరంగా ఉండడంతో మద్యం ప్రియులు ఎలాగో ఒకలాగు వెళుతూ వస్తున్నారు. గ్రావీణ ప్రాంతాల్లో అధికంగా చీప్‌ మద్యం విక్రయాలుంటాయి. పెరిగిన ధరలు కూలీనాలీ చేసుకునే వారికి ఈ ధరలు ఆర్థికంగా ఇబ్బందులను కలిగిస్తున్నాయి. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండడం
విశేషం. మద్యంప్రియుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు సారా తయారీ రవాణాదారులు పావులు కదుపుతున్నారు. తొలుత మారుమూల గ్రామాలకు కొంత మోతాదులో రవాణా చేస్తూ వస్తున్నారు. ఇలా అమ్మకాలు చేస్తూ క్రమేపీ గ్రావిూణ ప్రాంతాల్లో పాగా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిప్లలె, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు అటవీ ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలుండేవి. అక్కడి నుంచి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రవాణా చేస్తుండేవారు.అయితే ప్రస్తుతం మద్యం పాలసీ మారడంతో మళ్లీ నాటు సారా అమ్మకాలు పెరుగుతున్నాయి. సారా తయారు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ అధికారులు స్పష్టం చేశారు.