దళారులతో అనర్హులకు ప్రాధాన్యం
సోమశి ముంపు బాధితులకు అన్యాయం
కడప,ఫిబ్రవరి 26(జనం సాక్షి ): సోమశిల ముంపు జలాలతో సర్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగాలు దక్కని అభాగ్యులెందరో ప్రభుత్వం కరుణ కోసం చూస్తున్నారు. ఉన్న ఊళ్లు నీట మునిగాయి. పచ్చగా కళకళలాడే పొలాలు జలమయమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారం హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో తమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. జీవనాధారమైన పంట పొలాలు.. నీడనిచ్చే ఇళ్లు ముంపునకు గురయ్యాయి. జలాశయం దిగువ గ్రామాలకు పచ్చగా ఉండాలని భూములు త్యాగం చేశారు. 116 ముంపు గ్రామాలకు చెందిన 9,751 మంది అర్హుల జాబితాతో జిల్లా కమిటీ ప్రభుత్వానికి పంపింది. వారికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదు. కొందరికి వయస్సు మళ్లిపోతుంది. 1976లో చేపట్టిన ఈ రిజర్వాయరు పరిధిలో కడప జిల్లాలో గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట, పెనగలూరు, నందలూరు మండలాల పరిధిలో 116 గ్రామాలు, 62 వేల ఎకరాల సాగు భూములు ముంపునకు గురయ్యాయి. సోమశిల ముంపు రైతు కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని 1978 నవంబర్ 17న ఒక జీవో, రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణాల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికి ఓ ఉద్యోగం ఇవ్వాలని 1986 ఏప్రిల్ 15న ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. నిర్వాసిత రైతుల కుటుంబాల్లో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు 2014 జనవరి 25న నాటి కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కమిటీ నియమించారు. అయితే ఉద్యోగ అర్హుల జాబితాలో సగానికిపైగా అనర్హులు ఉన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. చాలామందికి ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. భూమిచ్చి రోడ్డున పడ్డాం. దిక్కులేక బతుకు భారమై దిక్కులు చూస్తున్నామని రైతులు మొత్తుకుంటున్నారు.
దళారులు రంగప్రవేశం చేసి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.




