హైదరాబాద్,ఫిబ్రవరి22(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు, ఉప కులాలకు న్యాయం జరుగుతుందని.. ఇందుకోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు, బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. డిమాండ్ల సాధనకు వచ్చే నెల 24న హైదరాబాద్‌లో మాదిగల శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్నామని.. అయినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. రాష్ట్రంలో 12 శాతం మాదిగ సామాజిక వర్గీయులు ఉన్నారని, ప్రభుత్వం మాదిగలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇవ్వాలని, రాష్ట్ర మంత్రివర్గంలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.




