మినీమహానాడులో కనిపించని మోత్కుపల్లి

పార్టీ మారడమే తరువాయి అంటున్న అనుచరులు
టిఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్న నర్సింహులు
యాదాద్రి భువనగిరి,మే22(జ‌నం సాక్షి): యాదాద్రి భువనగిరిలో జరిగిన టిడిపి మినీ మహానాడులో నర్సింహులు గైర్హాజరు వ్యవహారం ఆయన పార్టీ మారుతార్న దాకా వెల్లింది. మోత్కుపల్లి అనుచరులు వేదిక వద్ద దీనిపై గట్టిగానే నిలదీసారు. ఆయనను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. అయితే ఆహ్వానం పలికినా ఎందుకు రాలేదో తెలియదని పార్టీ అధ్యక్షుడు రమణ అన్నారు. మొత్తంగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. తనకు గవర్నర్‌ పదవి వస్తుందని..లేకుంటే రాజ్యసభ అయినా ఇవ్వాలని ఆయన టిడిపి అధినేతపై ఒత్తిడి చేశారు. ఈ రెండూ సాధ్యం కాలేదు. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకోవడంతో గవర్నర్‌ ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీంతో ఇక టిడిపిలో కొనసాగడం వల్ల వచ్చే లాభం లేదని గ్రహించారు. ఈ దశలో ఆయన ఇక ఖచ్చింతంగా అధికార టిఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా భవిష్యత్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా పరిణామాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. కొంత కాలంగా మౌనంగా ఉంటున్న మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈనెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్‌లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు
నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. ఆలేరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తుంగతుర్తి అసెంబ్లీ, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని టీఆర్‌ఎస్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మోత్కుపల్లిని కలిసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో తెలుగుదేశంలో ఉండి అవమానం భరించే కంటే టీఆర్‌ఎస్‌లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరికకు సంకేతాలు కనిపిస్తున్నాయి.   టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి ఇక ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని  గత మార్చి 18న మోత్కుపల్లి వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. పార్టీలో సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి లేకుండానే హైదరాబాద్‌లో చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీని తెలంగాణలో బతికించుకోవడానికి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆ తర్వాత మోత్కుపల్లి విూడియాకు వివరించారు. అయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మోత్కుపల్లి ఇక పార్టీ మారడంపై సీరియస్‌గా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇకపోతే
పదవీ రాకపోవడంతోపాటు పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం మోత్కుపల్లిలో ఉంది.  కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. భువనగిరిలో జరిగిన మినీమహానాడులో మోత్కుపల్లి పాల్గొనక పోవడం దీనికి సంకేతంగా చూస్తున్నారు.