దూకుడు పెంచిన కాంగ్రెస్
– కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబర్5(జనం సాక్షి) : ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తామూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పింది. ఓపక్క కేసీఆర్ ప్రభుత్వం విరుచుకుపడుతూనే ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లలో కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం జీవన్ రెడ్డి నేతృత్వంలోని సమావేశమైన మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు పలు నిర్ణయాలు కమిటీ తీసుకుంది. అనంతరం గాంధీభవన్‌ను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ వివరాలను ప్రకటించారు. ఆర్థిక నిపుణులను సంప్రదించి హావిూలు ఇస్తున్నామన్న ఉత్తమ్, రెండు మూడు వారాల్లో నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. త్వరలో హైదరాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కొంగరకలాన్‌లో సభ అట్టర్‌ఫ్లాపైనందునే హుస్నాబాద్ సభ పెడుతున్నారని అన్నారు. కొంగరకలాన్ సభకు 25 లక్షల మంది టార్గెట్ అయితే.. హుస్నాబాద్ సభకు 65 వేల మంది టార్గెట్ అని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్‌లో తమను టీఆర్‌ఎస్ నేతలు తిడితే.. దీటైన జవాబిస్తామన్నారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినవాళ్లు కూడా తమను తిట్టడం దారుణమని ఉత్తమ్ అన్నారు. అందరినీ మోసం చేసిన కేసీఆర్.. జర్నలిస్టులను కూడా వదల్లదేన్నారు. గెలిచే అవకాశం ఉన్న జర్నలిస్టులకు టికెట్లిస్తామన్నారు.
కమిటీ ప్రతిపాదనలలోని ప్రధానాంశాలు …
– తెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ
-ఇల్లు లేనివారికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరో రూ.లక్ష అదనం
– మిడ్ మానేరు నిర్వాసితులకు రెండు పడకగదుల ఇళ్లు
– కల్యాణలక్ష్మి, బంగారు లక్ష్మి పథకం కొనసాగింపు
– దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు
– ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ.2లక్షలు
– బీసీ, మైనారిటీలకు సబ్ ప్లాన్
– ఉపాధి కల్పనకు ప్రాధాన్యత
– తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి 6 కిలోలు సన్న బియ్యం
– దళిత, గిరిజనులకు సన్న బియ్యం ఉచితం
– ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
– మత ప్రార్థన స్థలాలకు కొంత ఉచిత విద్యుత్
– బీపీఎల్ కుటుంబాలకు 6 గ్యాస్ సిలెండర్లు ఉచితం
– 7వ తరగతి నుంచి ఇంటర్ చదివే అమ్మాయిలకు సైకిల్
– ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల వరకు పెంపు, అన్ని రకాల వ్యాధులకు వర్తింపచేస్తాం
– లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకం
– గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్ల నిధి
– కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తింపు




