మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్
– మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
అమరావతి, సెప్టెంబర్5(జనం సాక్షి) : దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని, అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో కోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలను రక్షించే వారు పాలకులు అవుతారే తప్ప భక్షించే వాళ్లు కాదన్నారు.దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాహుల్‌ను ప్రధానిని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ కర్నూలులో రాహుల్ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సవిూకరణాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయని, బీజేపీని ఓడించేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు అడుగులు వేస్తున్నాయని అన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో రాహుల్ ప్రభంజనం ఖాయమని ప్రకాశ్‌రెడ్డి జోస్యం చెప్పారు.