పర్యవేక్షణ లోపమే అంటున్న రైతులు
హైదరాబాద్,జూలై18(జనం సాక్షి): రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వ్యవసాయ అధికారులు అందుకు తగ్గ కృషి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తేవడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మాత్రం కొరవడింది. ఫలితంగా ఏటేటా విత్తనాల కోసం రైతులు పెట్టుబడి రూపంలో అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే వ్యవసాయాన్ని పండుగ చేయాలని,అందుకోసమే రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఎరువులు, విత్తనాల కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వమే ఇస్తుంది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ విత్తన పథకం అమలు చేస్తోంది. దీని కింద ఏటా ఖరీఫ్‌లో వ్యవసాయ శాఖ కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడి రైతులకు 50 శాతం రాయితీతో విత్తనాలను అందజేస్తోంది. వరి, కందులు, వేరుసెనగ తదితర పంటల విత్తనాలు ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు అందించి వారు ఉత్పత్తి చేసిన పంటను మిగిలిన రైతులకు అందజేయాలి. గత రెండు మూడు సీజన్ల నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఎంపిక చేసిన గ్రామాలకు నాణ్యమైన విత్తనాల సరఫరా జరుగుతోంది. కానీ ఆ విత్తనాలతో రైతులు పండించిన దిగుబడి లెక్కలు మాత్రం వ్యవసాయ శాఖ దగ్గర కొరవడ్డాయి. ఆ విత్తనాలతో పంట పండించిన రైతులు వాటిని తోటి రైతులకు కాకుండా మార్కెట్లోనే అమ్ముతున్నారు. మళ్లీ వచ్చే సీజన్‌కు యథాప్రకారం అధిక ధరకు విత్తనాలను కొంటున్నారు. అలా కాకుండా రాయితీతో గ్రామాల్లో రైతులకు సరఫరా చేసిన విత్తనాలతో పండించిన దిగుబడులను ఆ గ్రామం, చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందిస్తే వారికి పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ దిశగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ధ్రువీకరించిన విత్తనాలతో సాగు చేస్తున్న రైతులకు శాఖ నుంచి శిక్షణ కూడా ఇస్తున్నారు. సంప్రదాయ రసాయన ఎరువులతో కాకుండా సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు, పురుగుమందులు వాడాలని రైతులకు అవగాహన కల్పించారు. అయితే రాయితీపై విత్తనాలు పొందిన రైతుల్లో కొందరే సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. మిగతా వారు రసాయన ఎరువులోనే పయనిస్తున్నారు. చివరకు వచ్చేసరికి అందరూ వాటిని ఒకేదగ్గర అమ్ముతున్నారు. వ్యవసాయ అధికారులు విత్తనాల సరఫరాతోనే తమ పని పూర్తయిందనిపించకుండా ఆ విత్తనాలను మరింత మందికి అందిస్తే ఆర్థికంగా మేలు చేకూర్చినవారవుతారని రైతులు అభిప్రాయపడుతున్నారు.




