ఎండాకాలంలో పండువెన్నెల కురిపించిన సర్కార్
ఆనందంలో లక్షలాది రైతు కుటుంబాలు
హైదరాబాద్,మే19(జనం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు జరిగిన రైతుబంధు గ్రామసభలు జాతరను తలపించాయి. ఎండాకాలంలో పండువెన్నెల్లా కార్యక్రమం సాగింది. రైతులకు పన్నీటి జల్లు చల్లింది. దీనిని తప్పని అన్న వారెవరూ లేకుండా కార్యక్రమం విజయవంతం అయ్యింది. చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు స్వీకరించేందుకు రైతులు ప్రతీరోజూ ఉదయం పూటే గ్రామసభల వద్దకు చేరుకొని క్యూలో నిల్చొని ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. రైతుబంధు పథకం కింద ఇచ్చిన చెక్కులను మార్చుకునేందుకు తొమ్మిది రోజులుగా జిల్లాల్లోని అన్ని బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరి నగదు తీసుకున్నారు. బ్యాంకుల అధికారులు, సిబ్బంది రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక క్రమ పద్ధతిలో చెక్కులను తీసుకొని రైతులకు నగదును అందజేశారు. బ్యాంకుల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. వృద్దాప్యంలో ఉన్న రైతులను ముందుగా నగదు ఇచ్చి ఇళ్లకు పంపించారు. అన్ని బ్యాంకుల వద్ద ప్రత్యేక లైజన్ అధికారులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మహిళా రైతులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయా జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజన రైతులు రైతుబంధు పథకం ద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రయోజనం పొందారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలిసారిగా అన్నదాతలను ఆదుకునేందుకు దేశ చరిత్రలోనే రైతుబంధు పథకాన్నిప్రవేశపెట్టి రైతులకు సాగు సహాయాన్ని ఉచితంగా అందించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. రైతును రాజు చేయాలని.. అప్పులపాలవుతున్న రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వారికి ఆర్థికంగా అండదండగా నిలిచింది.అన్ని విధాలుగా రైతులకు మేలు చేసే విధంగా ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత పెట్టుబడి సహాయం కార్యక్రమానికి రైతుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ప్రతిపక్షాల్లో సైతం గుబులు మొదలైంది. గత పాలకులు ఏనాడూ ఇలా ఆలోచించలేదని రైతుబంధు గ్రామసభలకు హాజరైన
రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమ దిశగా కొనసాగుతూ ప్రతీ ఇంటా ఆనందాన్ని నింపుతున్న ప్రభుత్వాన్ని రైతులంతా ఆశీర్వదించారు. ప్రతీ రోజు చెక్కులు పంపిణీ వివరాలను ప్రభుత్వ పోర్టల్ నందు అప్డేట్ చేసారు. పంపిణీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. పంపిణీ చేసేందుకు రెండు రోజులు ముందుగానే సమాచారాన్ని ఆయా గ్రామ ప్రజలకు తెలియజేసారు. పాస్‌పుస్తకాలు, చెక్కులు రెండు కలిపి ఒకే కవరులో పెట్టి రైతులకు అందజేసారు. పాస్ పుస్తకాలు రాకుండా చెక్కులు మాత్రమే వచ్చినవి తహసిల్దార్ నిర్దారిస్తే డ్రాప్ట్లిస్టుపై సంతకం చేసిన తరువాత మాత్రమే రైతులకు పంపిణీ చేయించారు. ఇకపోతే తొలిరోజు సిఎం కెసిఆర్ కరీంనగర్లో పథకం ప్రారంబించగా ఎండలను సైతం లెక్కచేయకుండా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు నిరంతరంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అధికారయంత్రాంగం మొత్తం ఈకార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసింది.
ముగిసిన చెక్కుల పంపిణీ జాతర




