మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు ఖాయం..
టిఆర్ఎస్ యువ నాయకులు చంద్రకాంత్.
ఊరుకొండ, అక్టోబర్ 11 (జనంసాక్షి):
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని టిఆర్ఎస్ మండల యువ నాయకులు పులిజ్వాల చంద్రకాంత్ అన్నారు. మంగళవారం ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి ఊరుకొండ మండల టిఆర్ఎస్ యువ నాయకులు చంద్రకాంత్ తో పాటు మొండేల్ల శ్రీశైలం, రాచకొండ గోపి, బండి మల్లేష్, చందులు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. టిఆర్ఎస్ విజయ డంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పనిచేసే నాయకుడికి పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.