Monday, 2 November 2026

మున్సిపల్‌ ఎన్నికల్లో కఠిన నిబంధనలు

నేరగాళ్లకు పోటీ చేసే అవకాశాలు నిల్‌
ముందస్తు మార్గదర్శకాలతో మున్సిపాలిటీల్లో ప్రచారం
హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో కొన్ని రోజుల ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే మున్సిపల్‌ ఎన్నికలకు కూడా నియమ, నిబంధనలను రూపకల్పన చేసి విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి పలు రూపాల్లో కాంట్రాక్టులు చేస్తున్న వారిని గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాంట్రాక్టులు చేసే వారిని కూడా అనర్హులుగా ప్రకటించింది. మున్సిపాలిటీ తరఫున లేదా వ్యతిరేకంగా లీగల్‌ప్రాక్టీసనర్‌గా ఉంటూ పారితోషికం తీసుకున్న వారు కూడా పోటీకి అనర్హులే. ఎన్నికల్లో పోటీ చేసి పాలకులుగా సచ్చీలురు ఉండాలనే తలంపుతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలు కఠినతరం చేసింది. సమాజంలో నేర చరిత్ర కలిగి ఉండి రాజకీయాల్లోకి  వచ్చేవారిని అడ్డుకునేలా చర్యలు తీసుకున్నారు. రౌడీషీటర్లు, గుండాలు, కేసులు నమోదై ఉన్న వారు రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. క్రిమినల్‌ కోర్టు ద్వారా దోషిగా నిర్దారణ అయిన వారు, శిక్ష ఖరారైన రోజు నుంచి ఐదేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఒక కోర్టు దోషిగా నిర్దారించిన తరువాత సదరు వ్యక్తి పై కోర్టుకు అప్పీల్‌ చేసినప్పుడు కిందికోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండా కేవలం బెయిల్‌పై విడుదల చేసినా ఆ వ్యక్తి పోటీ చేయడానికి వీల్లేదని మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. అప్పుల్లో కూరుకుపోయి ఐపీకి దరఖాస్తు చేసుకున్న వారు, మతిస్థిమితం లేనివారు, మూగ, చెవిటి వారు, మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించింది.ఇకపోతే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి పోలింగ్‌ ముందురోజు వరకు ప్రతీరోజూ చేసే ప్రచారవ్యయంపై ఎప్పటికప్పుడు వివరాలు అధికారులకు సమర్పించాలి. ప్రచారంలో భాగంగా కరపత్రాలు, గోడపత్రాలపై ముద్రణదారుల పేర్లు లేకుంటే వాటిని అభ్యర్థుల ఖర్చుల జమ చేస్తామని ఎన్నికల సంఘం సభలు, సమావేశాలకు సంబంధించి సరైన వివరాలు సమర్పించకున్నా ఆ ఖర్చు కూడా అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. రోజూవారీగా లెక్కలు సమర్పించకుంటే వ్యయ పరిశీలకులే ప్రచారశైలిని పరిశీలించి నిర్దేశిరచిన సొమ్మును అభ్యర్థిపై వేస్తారు.
అభ్యర్థులు ప్రతీ పైసా బ్యాంకు ఖాతా నుంచే వెచ్చించాల్సి ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముగ్గురు సంతానం ఉన్నా వారిని పోటీ చేసేందుకు అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో మున్సిపల్‌ వార్డుల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీ చేసే అభ్యర్థుల అర్హత, ధరావత్తు సొమ్ము, ప్రచార వ్యయం ఇతర అంశాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేసి సంబంధిత రాజకీయ పక్షాలకు కరదీపికలను అందించనుంది. పోటీ చేయాలనుకునే వారిలో జనరల్‌ అభ్యర్థులు అయితే రూ.2500, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.1,250 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.  1995 తరువాత ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉన్న వారు కూడా పోటీ చేయకూడదని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో పనిచేసే వారు ముందుగా వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి, రాజీనామాను ఆమోదింపచేసిన తరువాతే నామినేషన్‌ను దాఖలు చేయాలి. రాజీనామా ఆమోదించకుంటే నామినేషన్‌ను తిరస్కరించే అధికారి రిటర్నింగ్‌ అధికారికి ఉంది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమ, నిబంధనలను తూచా తప్పకుండాఅభ్యర్థులు పాటించాలని ఎన్నికల సంఘం తెలిపింది. అందుకు విరుద్ధంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని మార్గదర్శకాల్లో హెచ్చరించింది. పోటీ చేసే అభ్యర్థులను బెదిరించినా, అపహరించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా ఏడాది జైలుశిక్షతో పాటు జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా వారిని ఆరేండ్ల పాటు ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించనున్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి 44గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుందని, ప్రచారంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్ధనా స్థలాల్లో చర్చావేదికలుగా వాడుకోరాదని మార్గదర్శకాల్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇవన్నీ సాధారణమే అయినా ఎన్నికలప్పుడు విడుదల చేయడం ఆనవాయితీగా మారింది.
——————-