Tuesday, 3 November 2026

మూడేళ్లుగా కెసిఆర్‌ మాటలతో మభ్యపెడుతున్నారు

ఇచ్చిన హావిూలకు విలువ లేకుండా పోయింది

కాంగ్రెస్‌ శిక్షణా శిబిరంలో మాజీమంత్రి జైపాల్‌ రెడ్డి మండిపాటు

ఉత్తమ్‌ ప్రసంగిస్తుండగా కోమటిరెడ్డి అనుచరలు నినాదాలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణలో గత మూడేళ్లుగా సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూలు ఒక్కటి కూడా అమలు కావడంలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. శంషాబాద్‌ లో కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి బ్రదర్స్‌ అనుచరులు హల్‌చల్‌ చేశారు. తమ నేతను స్టేజీ పైకి పిలువనందుకు నిరసనగా నినాదాలుచేశారు. ఆ తరవాత కోటిరెడ్డి బ్రదర్స్‌ సమావేశం బహిష్కరించి వెళ్లి పోయారు. అంతుకుముందు జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ మాటల గారడీతో ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. దళితులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. అందమైన అబద్దాలు చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. దళితులకు భూపంపిణీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుపై మాట తప్పారన్నారు. అలాగే కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన హావిూలన్నీ అమలు చేశామని, కేసీఆర్‌ ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని జైపాల్‌రెడ్డి విమర్శించారు. పారదర్శకత లేని సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అని, దేశాన్ని కాషాయీకరణ చేయాలని చూస్తున్నారని జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌లు తుగ్లక్‌ బాటలో నడుస్తున్నారని.. అందువల్లే అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల ఆరోపించారు. సమవేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్‌ అన్నదమ్ములుగా తయారయ్యారు. ఇద్దరు అభివృద్ధిని పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారు.నోట్ల రద్దు వల్ల నల్లధనం ఎంత వెనక్కి వచ్చిందో మోదీ ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. హడావిడిగా నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్యులు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకేం తెలుసు? రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ప్రజలను పక్కన పెట్టి వారి కోసం ప్రగతిభవన్‌లు, సచివాలయాలు కట్టుకుంటున్నారు. కేసీఆర్‌ విూద పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు.పెద్దనోట్ల రద్దుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాధించింది శూన్యమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ… మోదీ పాలనలో అవినీతి 67 శాతం పెరిగిందని సీవీసీ రిపోర్టే చెబుతోందన్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, పేద ప్రజలపై నోట్ల రద్దు తీవప్రభావం చూపిందన్నారు. అంతేగాక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 35 శాతం మంది ఉద్యోగాలు పోయాయని ఆయన అన్నారు. ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భయపడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. శిక్షణకు హాజరైన షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ… రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనన్నారు. అలాగే సోనియా గాంధీవల్లే తెలంగాణకు 54 శాతం విద్యుత్‌ వాటా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతుండగా శిక్షణా శిబిరంలో మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. శిక్షణకు విచ్చేసిన వారు వేదిక వద్దకు రాకుండా కార్యకర్తల మధ్యన కూర్చున్నారు. అయితే… టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కోమటిరెడ్డి అనుచరులు పెద్దపెట్టున నినాదాలు ఇచ్చారు. అనంతరం తన అనుచరులతో కలిసి కోమటిరెడ్డి బ్రదర్స్‌ బయటకు వెళ్లిపోయారు. ఇందులో పొన్నాల లక్ష్మయ్య, విహెచ్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.