Thursday, 5 November 2026

మెరిట్‌ విద్యార్థులకు కార్పొరేట్‌ కాలేజీల గాలం

ఇంటింటికీ వెళ్లి ప్రచారం
అడ్మిషన్లు ఉచితం అంటూ తాయిలం
హైదరాబాద్‌,మే23(జ‌నం సాక్షి): కార్పొరేట్‌ కళాశాలలు ఇప్పటికే జిల్లాల్లోని పలు ప్రధాన పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో పీఆర్‌ఓలను నియమించుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను రకరకాల మాటలతో బుట్టలో వేసుకుని వారి పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఉచిత సీటు, హాస్టల్‌ వసతి అంటూ మభ్యపెట్టి అడ్మిన్లు ఇస్తున్నాయి. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలు ఇప్పటికే సేకరించిన కళాశాలల ప్రతినిధులు వారి ఇళ్లకు వెళ్లి రకరకాల మాటలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రోత్సాహకాలు, రాయితీలు అంటూ విద్యార్థులకు ముందే అడ్మిషన్‌ ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఇందుకోసం స్‌థ్ధానిక పాఠశాలల నిర్వహకులకు కూడా కొంత ముడుపులు ముట్టచెపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇటువంటి ప్రవేశాలు నిబంధనలకు విరుద్ధమైనా అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 20వ తేదీన ఇంటర్‌ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇంటర్‌ బోర్డు వెలువరించింది. కానీ, కార్పొరేట్‌, సాధారణ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌ ప్రవేశాలు అప్పటికే చాలా వరకు పూర్తిచేశాయి. కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజులు సాధారణస్‌థ్ధాయిలో లేవు. ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేయాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఐఐటీ ప్రత్యేకం పేరుతో ఎంపీసీలో ప్రవేశాలకు ఏడాదికి రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఫీజు నిర్ణయించారు. అదే గ్రూప్‌ విద్యార్థులు, ఏసీ క్యాంపస్‌లో చదవాలంటే అదనంగా రూ.15వేలు చెల్లించుకోవాల్సిందే. మరోవైపు సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌ల్లోనూ ఫీజులు భారీగానే
గుంజుతున్నారు. గత సంవత్సరం తమ కళాశాలకు రాష్ట్రస్థాయిలో ర్యాంక్‌లు వచ్చాయని చెప్పుకుంటూ, ఆ స్థాయిలో చదువులు చెప్పాలంటే ఫీజులు ఆ మాత్రం ఉంటాయని చెబుతున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు అడ్మిషన్‌ ఫీజులు, డ్రస్‌, మెటీరియల్‌.. తదితరాలంటూ అదనపు వసూళ్లు ఉండనే ఉంటాయి..
ప్రైవేట్‌ విద్యాసంస్థల పీఆర్‌ఓల మాయమాటలకు బోల్తాపడుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు ముగిసిన నాటి నుంచి ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, నిబంధనలు ధిక్కరిస్తే సహించేది లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాతే అడ్మిషన్లు పక్రియ నిర్వహించాలని ప్రకటించింది. వీటన్నింటినీ పాటించాల్సిన కళాశాలలు తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి.  మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులే టార్గెట్‌గా ప్రచారం చేస్తున్నారు.కార్పొరేట్‌ ధాటికి సాధారణ కళాశాలలు విలవిల్లాడుతున్నాయి. కార్పొరేట్‌ కళాశాలలు.. అందునా ఆంధ్రాకు చెందిన విద్యాసంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి.. ఇప్పటికే ప్రవేశాలు పూర్తి చేసుకునే దిశకు చేరాయి. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. దీంతో చిన్నచిన్న విద్యాసంస్థల మనుగడను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.