Thursday, 5 November 2026

మోత్కుపల్లితో భేటీకి విజయసాయి యత్నం

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళమోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ విూడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. ప్రస్తుతం మౌనంగా ఉన్న మోత్కుపల్లి తన భవిష్యత్‌ కార్యక్రమంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌ను కొనియాడుతున్న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారన్నవార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయసాయి, మోత్కుపల్లిని కలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రత్యేకత సంతరించుకుంది. తన రాజకీయ భవితవ్యం ఎలా ఉండాలన్న దానిపై మోత్కుపల్లి ఈ నెల 13న ఆలేరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేడర్‌ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత 15వ తేదీ లేదా 16న తన ముఖ్య అనుచరులతో సమావేశం అవుతారని తెలియవచ్చింది. ఈ రెండు సమావేశాల తర్వాతే ఆయన అధికారికంగా తన భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.