Thursday, 5 November 2026

రాఫెల్‌ కుంభకోణంపై..

కేటీఆర్‌ ఎందుకు మాట్లాడరు
– స్పీకర్‌కు హైకోర్టు నోటీసులివ్వడం తెరాస ప్రభుత్వానికి సిగ్గుచేటు
– బర్రెలు, గొర్రెలు ఇచ్చి బీసీలను మోసం చేస్తున్నాడు
– బీసీలపై చిత్తశుద్ది ఉంటే 69శాతం రిజిర్వేషన్‌ కల్పించాలి
– రాహుల్‌ పర్యటన విజయవంతం అయింది
– కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు
హైదరాబాద్‌, ఆగస్టు15(జ‌నం సాక్షి) : భోఫోర్స్‌ కుంభకోణం గురించి మాట్లాడుతున్న కేటీఆర్‌ బీజేపీ హయాంలఓ జరిగిన రాఫెల్‌ కుంభకోణంపై ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్‌ నేత వి. హనుమంత్‌రావు ప్రశ్నించారు.  బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై  మండిపడ్డారు. ఏబీసీ అంటే ఏంటో తెలుసా అంటూ రాహుల్‌గాంధీపై ట్విటర్లో విమర్శలు చేసిన కేటీఆర్‌.. నిజాలు మాట్లాడడం లేదని విమర్శించారు. ‘బోఫోర్స్‌ స్కాం అన్నావ్‌.. కానీ అదే బోఫోర్స్‌ ఫిరంగులతో కార్గిల్‌ యుద్దం గెలిచిన సంగతి మరచిపోవద్దని కేటీఆర్‌ను హెచ్చరించారు. బోఫోర్స్‌ కుంభకోణం గురించి మాట్లాడుతున్న కేటీఆర్‌ బీజేపీ హయాంలో చోటుచేసుకున్న రాఫెల్‌ స్కాం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రాహుల్‌ పర్యటన గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్‌ పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్‌ చాలా ప్రయత్నాలు చేశాడని అన్నారు. సంపత్‌, కోమటిరెడ్డి కేసులో స్పీకర్‌ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కేసీఆర్‌ సర్కార్‌కు సిగ్గుచేటని అన్నారు. గొర్రెలు, బర్రెలు అంటూ కేసీఆర్‌ బీసీలను మోసం చేస్తున్నాడని అన్నారు. బీసీలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 69 శాతానికి పెంచి రాజ్యాంగంలోని 9 షెడ్యూల్‌లో పెట్టించాలని సవాల్‌ విసిరారు. బీసీ క్రిమిలేయర్‌ను ఎత్తేస్తామని పార్టీ మేనిఫెస్టోలో చెప్పాలని అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తేసే విషయం తమ నేత రాహుల్‌కు చెబితే సానుకూలంగా స్పందించారన్నారు.