మందు బాబుల వీరంగం

– అటవీశాఖ అధికారిపై దాడి
– శ్రీశైలం అటవీ కార్యాలయం వద్ద ఘటన
కర్నూలు, ఆగస్టు15(జ‌నం సాక్షి) : శ్రీశైలం అటవీ కార్యాలయం దగ్గర మంగళవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు హల్‌ చల్‌ చేశారు. రోడ్డుపై మద్యం తాగుతూ అరుస్తూ ఇష్టం వచ్చినట్లు చిందులు వేస్తూ, వాహనం దారులకు ఇబ్బందులు కలిగించారు. వారి ఆగడాలను అడ్డుకున్న ఫారెస్టు అధికారిపై దాడి చేశారు. వారంతా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. మందేసి చిందేసిన ఐదుగురిలో ఒకడు తాను తెలంగాణ ఎమ్మెల్సీ కుమారుడినంటూ సెక్షన్‌ ఆఫీసర్‌ స్వరూప్‌ సాగర్‌పై దాడి చేశారు. దాదాపు గంటకుపైగా ఐదుగురు కలిసి అధికారిని పట్టుకుని అటూఇటూ తిప్పుతూ అసభ్య పదజాలంతో దూషించారు. గన్‌తో కాలుస్తామంటూ హెచ్చరించారు. తమ కాళ్లు పట్టుకుని వేడుకుంటే వదిలేస్తామంటూ మందుబాబులు అధికారిని హుకుం జారీ చేశారు. ఈ తతంగాన్ని మొత్తం సెల్‌లో వీడియో తీసుకున్నారు. తనకు జరిగిన అవమానాన్ని, మందుబాబు ఆగడాలను సెక్షన్‌ ఆఫీసర్‌ ఇతర సిబ్బందికి తెలిపారు. వెంటనే స్పందించిన ఫారెస్టు సిబ్బంది ఐదుగురు మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు