రామ్‌తో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ సినిమా

కథను ఫైనల్‌ చేసిన దర్శకుడు బోయపాటి
హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నది. ఇప్పటికే సినిమా ను లాంఛనంగా ప్రారంభించారు. మొన్నటి వరకు ది వారియర్‌ పనుల్లో బిజీగా ఉన్న రామ్‌ ఎట్టకేలకు బోయపాటికి టైమ్‌ ఇచ్చాడట. దాంతో బోయపాటి చకచక షూటింగ్‌ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బాలయ్యతో అఖండ సినిమాను తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి అంతకు మించి అన్నట్లుగా ఉండేలా రామ్‌ తో సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ సినిమా లో రామ్‌ ద్వి పాత్రాభినయం చేయబోతున్నాడు. రెండు పాత్రలు కూడా పూర్తి విభిన్నమైన వేరియేషన్స్‌ కలిగి ఉంటాయట. రామ్‌ రెండు పాత్రల కోసం రెండు విభిన్నమైన లుక్స్‌ లో కనిపించాల్సిన అవసరం ఉందట. అందుకోసం చాలానే కష్టపడాల్సి ఉంది.
అంతే కాకుండా ఈ సినిమా ఒక అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ అని.. రామ్‌ కి ఇలాంటి మాస్‌ యాక్షన్‌ స్క్రిప్ట్‌ లు బాగా నప్పుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బోయపాటి స్క్రిప్ట్‌ కోసం చాలా సమయం కేటాయించడం వల్ల పలు వర్షన్‌ లను రెడీ చేసి చివరకు ది బెస్ట్‌ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.
హీరోగా రామ్‌ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత వచ్చిన రెండు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో బోయపాటి సినిమా పై రామ్‌ ఆశలు పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.