Thursday, 5 November 2026

రాష్ట్రంలో అణచివేత ధోరణిలో కేసీఆర్‌ పాలన

కోర్టు ధిక్కరణ కింద మరోసారి కోర్టుకెళ్తాం
11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తాం
త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం
నిరంకుశ పాలనపై కరపత్రాలు పంచుతాం
ఖమ్మం, అలంపూర్‌లలో భారీ సభలు
టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
మా నిరసనలను స్పందించకుంటే మూకుమ్మడి రాజీనామాలపై ఆలోచిస్తాం
ప్రతిపక్ష నేత జానారెడ్డి
హైదరాబాద్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో అణచివేత ధోరణిలో తెరాస పాలన సాగుతుందని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాలు పునరుద్దరణ, పార్టీలో నెలకొన్న విబేధాలపై శుక్రవారం జానారెడ్డి ఇంటిలో కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత విబేధాలతో పాటు నాగం చేరికతో నాగర్‌కర్నూల్‌లో పరిణామాలపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ విలేకరుతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అయితే… కోర్టు ధిక్కరణ కింద మరోసారి కోర్టుకు వెళ్తామని, కోర్టుతీర్పును గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దుచేసే హక్కు స్పీకర్‌కు, ముఖ్యమంత్రి లేదని ఉత్తమ్‌ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అణచివేత ధోరణిలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనర్హత వేటుపై ఈ నెల 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తామన్నారు. త్వరలో రాష్ట్ర పతి అపాయింట్‌మెంట్‌ తీసుకొని ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను వివరిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ఖమ్మం, అలంపూర్‌లో త్వరలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనపై కరపత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఖమ్మం, అలంపూర్‌లలో ఏదో ఒక ప్రాంతంలో సభలు చేపట్టి 24గంటల నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ తెలిపారు.
స్పందించకుంటే మూకుమ్మడి రాజీనామాలు  జానా
తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తుందని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. పద్దతిలేకుండా అడ్డగోలుగా పాలన సాగిస్తుందని, కేసీఆర్‌ పాలన తీరుతో ప్రజలు విసిగి పోతున్నారన్నారు. కేసీఆర్‌ పాలన విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనలు వ్యక్తం చేస్తామని, ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరిద్దరించాలని ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆందోళనలకు ప్రభుత్వం స్పందించక పోతే మూకుమ్మడి రాజీనామాలపై చర్చిస్తామన్నారు. సీఎల్పీ సమావేశాన్ని అవసరాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చని, అన్నారు. రాజీనామాల విషయంపై చర్చ జరిగిందనా అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ సమయం వస్తే ముందే విూడియాకు తెలియజేస్తామని జానా తెలిపారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.