Tuesday, 3 November 2026

రాష్ట్రంలో 1.69కోట్ల ఈత మొక్కలు నాటాం

– గీత కార్మికులకు రూ.6 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం

– ఎక్సైస్‌ శాఖ మంత్రి పద్మారావు

హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : గీత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎక్సైస్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఈత, తాటి చెట్లను నాటారు..ఆ చెట్ల నుంచి ప్రకృతి సిద్ధంగా తీసిన నీరా పానీయం క్రయవిక్రయాలకు తీసుకుంటున్న చర్యల ఏమిటి..? గీత కార్మికులు చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని, వారికి కేరళలో మాదిరిగా అత్యాధునిక పరికరాలు అందించాలని కోరారు. దానితో పాటు ప్రమాదానికి గురైన చనిపోయిన వారి గీత కార్మికుల కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 69 లక్షలకు పైగా ఈత మొక్కలను నాటామని మంత్రి తెలిపారు. ఈత చెట్లను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో కల్లు ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్తగా గీత కార్మికులు చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా కేరళలో అందుబాటులో ఉన్న యంత్రాలను పరిశీలిస్తున్నామని, మనకు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయనుకుంటే వాటిని తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.