Monday, 2 November 2026

రికార్డుల సవరణలతో చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు

జీవో 39తో గందరగోళంలో రాష్ట్ర ప్రజలు

మగ్రమైన పరిశోధన తర్వాతనే భూ సర్వే చేపట్టాలన్న శ్రవణ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): భూ సమగ్ర సర్వేకి కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కేవలం రికార్డుల సవరణలతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్‌ లో విూడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూ సర్వే రికార్డుల ధృవీకరణ జరగాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఒప్పించలేకే తప్పుడు జీవోలతో గందరగోళంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విడుదల చేసిన జీవో 39ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సమన్వయ సమితిలు, రైతులకు పెట్టుబడి విషయంలో రికార్డుల ధృవీకరణను కలపడంతో గందరగోళంలో ఉన్నారని తెలిపారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే దేశవ్యాప్తంగా ల్యాండ్‌ రికార్డ్‌ లను ఆధునీకరించాలనుకున్నారని, అయితే మోడీ ప్రభుత్వం కూడా పేరు మార్చి దీన్ని కొనసాగించింద్నారు. భూములకి సంబంధించి 112 చట్టాలున్నాయని, వీటన్నింటిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆదరా బాదరాగా సర్వే చేయొద్దని సూచించారు. గ్రామ సభల ద్వారానే రైతులకు పెట్టుబడి లబ్ది దారులని గుర్తించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలన్నారు. అలాగే రైతు సంఘాలతో చర్చించాలని చెప్పారు. సమగ్రమైన పరిశోధన తర్వాతనే భూ సర్వే చేపట్టాలన్నారు. సాదా బైనామా స్కీమ్‌ ను భూ సమగ్ర సర్వే పూర్తయ్యేంత వరకు కొనసాగించాలని సూచించారు.