– గుజరాత్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతలు మావైపు వస్తారు
– తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీనే
– అసెంబ్లీ లాబీలో భాజపా నేత సంకినేని వెంకటేశ్వరరావు
హైదరాబాద్, నవంబర్16(జనంసాక్షి) : ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు ఫుట్‌బాల్ ఆడుకుంటారని, ప్రజాసమస్యలపై గొంతెత్తుడేమోకాని.. సొంత పార్టీలోని ప్రత్యర్థులను ఎదుర్కోవటమే రేవంత్‌కు సరిపోతుందని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజకీయాలంటేనే ఊహల్లో ముందుకెళ్ళడం సహజమని.. కానీ నేటిరోజుల్లో అన్ని పార్టీలకు సిద్ధాంతాలు
లేవన్నారు.. ఉన్న పార్టీల్లో కొంతవరకు మంచి పార్టీలు ఎంచుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ లేదని, ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇతర పార్టీల్లోకి వసలులు కడుతున్నారని.. ఇక ఆపార్టీ ఎక్కడుంటుందన్నారు.. ఉన్న పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు మావైపు చూస్తారన్నారు. డి. శ్రీనివాస్ కుమారుడు ఇప్పటికే మా పార్టీలో చేరారు… ఆయన తరహాలోనే ముఖ్యనేతల వారసులు బీజేపీ వైపు చూస్తున్నారని సంకినేని అన్నారు. అలాగే జానారెడ్డి, ఉత్తమ్ మినహా కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌లో మిగిలిన బలమైన నేతలు బీజేపీలోకి రావచ్చేమోనని, అలా వస్తే మేమే ప్రత్యామ్నాయం అవుతామని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.




