Tuesday, 3 November 2026

రేవంత్‌ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం

– పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమికొడతారు
– కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టుల నిర్మాణాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు
– ప్రభుత్వం ప్రతి పనిని పారదర్శకంగా చేస్తుంది
– తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తాం
– ప్రాజెక్టుల నుంచి వచ్చే ప్రవాహంలో కాంగ్రెస్‌ నేతలు కొట్టుకుపోవటం ఖాయం
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు4(జ‌నం సాక్షి) : రేవంత్‌ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెరాస పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రేవంత్‌ చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన… రేవంత్‌ చిప్పకూడు తిన్నా బుద్ది మార్చుకోలేదని మండిపడ్డారు. బ్లాక్‌ మెయిల్‌ చేసి సంపాందించిన డబ్బు అహంకారంతో రేవంత్‌ అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు బెదిరించినా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి మరలదని స్పష్టం చేశారు. నేను నా సోదరిని బెదిరించి ఆస్తులు సంపాందించుకున్నానని రేవంత్‌ సిగ్గు లేకుండా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసలు నాకు అక్కా చెల్లెళ్లు ఎవరూ లేరని, మేం ముగ్గురం అన్నదమ్ములమే అని రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పిచ్చి ఆరోపణలు చేస్తే రేవంత్‌ కు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏవైనా అభ్యంతరాలుంటే కాంగ్రెస్‌ నేతలు కోర్టులకు వెళ్లవచ్చనని, ప్రతీ దానికి కోర్టుకు వెళుతున్న వారు ఇప్పుడు కోర్టుకు వెళితే ఎవరు అడ్డుకున్నారు? అంటూ ప్రశ్నించారు. వారం రోజులుగా కాంగ్రెస్‌ నేతలు సాగునీటిప్రాజెక్టులపై అబద్దాలు మాట్లాడుతున్నారన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. మంత్రి హరీష్‌ రావు ఇప్పటికే ఆ ఆరోపణలపై సుధీర్ఘ వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి వివరణతో సంతృప్తి చెందకుండా అబద్ధాల్లో పుట్టి అబద్ధాలనే తింటూ పెరుగుతున్న రేవంత్‌ రెడ్డి అసభ్య పదజాలంతో దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. 2005లోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా టన్నెల్‌ వన్‌ పనులు 2008లో, రెండో టన్నెల్‌ పనులు 2011లో ప్రారంభించారన్న రాజేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ వచ్చిన వెంటనే
సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు. 2014 జూన్‌ వరకు 43 కిలోవిూటర్ల మేర టన్నెల్‌ 1 మొత్తం పొడవులో కేవలం 23 కిలోవిూటర్ల మేర పనులు పూర్తయ్యాయయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10కిలోవిూటర్ల టన్నెల్‌ పనులు పూర్తయ్యాయన్నారు. సాంకేతిక ఇబ్బందులతోనే పనులు కొంత ఆలస్యమవుతున్నాయని స్పష్టం చేశారు. పనులు తొందరగా పూర్తిచేసి నల్లగొండ జిల్లాలో రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కృషిచేస్తున్నామని వెల్లడించారు. ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసమే సీతరామ ప్రాజెక్టు కోసం కొత్త జీవోలు తెచ్చిందని, రేవంత్‌ లాంటి బ్లాక్‌ మెయిలర్‌ ఎంత అడ్డుపడ్డా ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు రాజేశ్వర్‌ రెడ్డి  స్పష్టంచేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఆ ప్రవాహంలో కాంగ్రెస్‌ నేతలు కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కేసీఆర్‌ పై ఆరోపణలు చేశారని, అయినా కేసీఆర్‌ తెలంగాణ సాధించారని పల్లా పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్‌ ప్రాజెక్టులు కట్టి తీరుతారని స్పష్టం పల్లా స్పష్టం చేశారు.