Tuesday, 3 November 2026

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

పబ్లిక్‌ సర్వెంట్లపై అవాస్తవాలు మాట్లాడడం సరికాదు
తానుజారిపడి భుజం ఎముక చిట్లడంతో రెస్ట్‌ తీసుకుంటున్నా
రేవంత్‌ వ్యాఖ్యలను ఆక్షేపించిన డిజిపి మహేందర్‌ రెడ్డి
హైదరాబాద్‌,మార్చి3(జనం సాక్షి): తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా శాఖ అధ్యక్షులు,రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదని డిజిపి మహేందర్‌ రెడ్డి అన్నారు. మా ఇంట్లో జారిపడిన సంఘటనలో నాకు ఎడమ భుజం పైన బోన్‌ చిట్లిందని అన్నారు. మూడు చోట్ల ఫ్రాక్చర్‌ జరిగాయని ఎక్స్‌ `రే, సి.టీ. స్కాన్‌, ఎం.ఆర్‌.ఐ లలో తేలింది. దీనితో, భుజం కదలకుండా కట్టు కట్టడం జరిగిందన్నారు. విరిగిన బోన్‌ మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18 వ తేదీ నుండి మార్చి 4 వతేదీ వరకు సెలవులో వెళ్లడం జరిగింది. తిరిగి, వైద్యుల సలహా మేరకు విధుల్లో జాయిన్‌ అవడం జరుగుతుంది. ఈ మేరకు రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడడం జరుగుతోంది.ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడు, బాధ్యతా రహిత
ప్రచారం చేయడం పట్ల డిజిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదు. తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్‌ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉందన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్‌ శాఖ స్థయిర్యాన్ని దెబ్బతీయడం తోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందన్నారు. బాధ్యతాయుత సీనియర్‌ అల్‌ ఇండియా సర్వీసు అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయయనం పాటించాలని కోరుతున్నా అంటూ మహేందర్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.