అడియాశలు కానున్న కాంగ్రెస్ ఆశలు
కొత్త టీమ్‌తో ఎన్నికలకు వెళ్లేలా కెసిఆర్ కసరత్తు
హైదరాబాద్,జూన్13(జనం సాక్షి): రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ఆయన దూరాభారం ఆలోచించి ఈ పథకం అమలు చేస్తున్నారని ఎవరిని అడిగినా చెబుతారు.కేవలం ఎన్నికల్లో ఓటుబ్యాంక్‌ను పదిలపర్చుకునే దిశగా ఈ పథకం బాగా ఉపయోగపడనుంది. ఈ ఒక్క పథకంతో ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్‌కు ఉన్న వ్యతిరేకత కూడా మటుమాయం అయ్యింది. ఎందుకంటే రైతులంతా ఇప్పుడు కెసిఆర్‌కు జై అంటున్నారు. దీనికితోడు బీమా పథకం రాబోతున్నది. విపక్షాలకు అవకాశం లేకుండా పథకాలతో కెసిఆర్ గట్టి దెబ్బనే కొట్టారు. దీంతో అన్ని పార్టీలు కలసినా ఇప్పుడు కెసిఆర్‌ను ఢీకొనడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా ఉన్నారని తెలంగాణలో అమలవుతున్న పథకాలతో దేశవ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. ఇదొక్కటే చాలు కెసిఆర్ రేపటి ఎన్నికలపై ధీమాగా ఉన్నారనడానికి. ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీన పడుతున్నారని ప్రచారం సాగుఉతన్న వేళ తెలంగాణలో కెసిఆర్ మరింతగా బలోపేతం కావడం రాజకీయంగా కలసివచ్చే అంశంగా చూడాలి. అయితే ఏపీలో చంద్రబాబుకు తిరుగులేదనీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై ప్రజలలో నమ్మకం రావడం లేదనీ లోపాయకారిగా బాబు ప్రచారం చేసుకుంటున్నా అంత సీన్ లేదని ఎపి ప్రజలే బాహాటంగా అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగా తన స్థానాన్ని పదిల పర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతిపక్షాలను చీల్చి తాను బలపడటమే కాకుండా ప్రతిపక్షాలను బలహీనపరిచారు. ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమన్నారు. ఇది పార్టీల కలయికో లేదా విలీనంగానో చూడరాదన్నారు. ఇదంతా తెలంగాణ అభివృద్దిలో బాగమని విశ్లేషించారు. ఆ తర్వాత వివిధ పథకాలకు రూపకల్పన చేయడం ద్వారా ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే రైతుబంధు పథకం ప్రకటించడంతో పాటు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో రైతులతో పాటు ప్రజల్లో కూడా భరోసా పెరిగింది. అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పథకాలు అందరికీ అందకపోవడం వల్ల ప్రజలలో అసంతృప్తి ఉందన్నది అధికారపార్టీ నాయకుల అంచనా! తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2లక్షల రుణమాఫీ అంటున్నా ప్రజలు ముఖ్యంగా రైతులు నమ్మడానికి లేకుండా పోయింది. ఇకపోతే రేపటి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇదొక్కటే కారణం కాదు. ఇప్పుడున్న టీమ్‌తో వెలితే ఓటమి ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా బాగా
తెలుసు. తన పట్ల ప్రజలలో వ్యతిరేక భావన లేనప్పటికీ పలువురు శాసనసభ్యులపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న విషయం కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను మార్చకపోతే ఓటమి ఖాయమని గుర్తించి అందుకు గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలలో అనుకూలత ఉన్నప్పటికీ కనీసం 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే దాని ప్రభావం గెలుపుపై పడుతుందని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయిందనీ, పార్టీ నాయకులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇవన్నీ బేరీజు వేసుకుని కొత్తటీమ్‌తో కెసిఆర్ ఎన్నికలకు వెళ్లేలా కసరత్తు మొదలు పెట్టారని సమాచారం.




