Wednesday, 4 November 2026

రైతుబంధు చెక్కులకు నగదు కొరత లేకుండా చేశాం

ఈ పథకం కింద రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల నగదు

ఆర్‌బిఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ వెల్లడి

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి ): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ఓవైపు విజయవంతం కాగా, రైతు బీమా కోసం ప్రభుత్వం ఇప్టపికే సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఎల్‌ఐసితో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ దశలొ ఇప్పటి వరకు ఈ పథకం కింద రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల రూపాయలు చేరినట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత సమస్య తలెత్తలేదని ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రైతుబంధు పథకానికి అనుకున్న సమయంలో అవసరమైన మొత్తంలో దాదాపు 95 శాతం నగదును బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఈ పథకం కింద నగదు పంపిణీ సంతృప్తికరంగా సాగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా రైతుల నుంచి ఫిర్యాదులు లేవన్నారు. రైతులంతా సంతృప్తిగా ఉన్నట్టు తమకు బ్యాంకుల నుంచి, రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి సమాచారముందని చెప్పారు. రైతుబంధు పథకం కింద ప్రత్యేకంగా దాదాపు 59 లక్షల చెక్కులను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్టు ఆర్బీఐ రిజనల్‌ డైరెక్టర్‌ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్టాల్లో నగదు కొరతలేదన్నారు. ఏటీఎంలలలో కూడా చాలినంత నగదును సిద్ధంగా ఉంచుతున్నట్టు చెప్పారు. ఏప్రిల్‌ మొదటి వారంలో నగదు కొరతపై తెలంగాణతో పాటు ఇతర రాష్టా/-రాల్లో ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సమస్యలేదన్నారు. ఇక బ్యాంకు లావాదేవీలపై ఖాతాదారుల్లో చైతన్యం తీసుకురావడానికి, ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలో అప్రమత్తంచేసేందుకు ఈ నెల 8వ తారీఖు వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో విజిలెన్స్‌, ఆవేర్‌నెస్‌ వీక్‌ గా పాటిస్తున్నామన్నారు.