Thursday, 5 November 2026

రైతులకే నేరుగా చెక్కులు,పట్టా పుస్తకాలు

తహసిల్దార్లకు స్పష్టమైన మార్గదర్శకాలు
హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం చెక్కులను నేరుగా రైతులకే అందజేయనున్నారు. చెక్కులను కుటుంబసభ్యులు, మధ్యవర్తుల చేతికి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులెవరైనా అనారోగ్యం లేదా నడవలేని స్థితిలో ఉంటే అధికారులు వారి ఇంటివద్దకే వెళ్లి
అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అటవీహక్కు యాజమాన్య పత్రాలున్న గిరిజనభూములు కలిపి మొత్తం 1.43 కోట్ల ఎకరాలకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం ఇవ్వనుంది. పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రప్రభుత్వం తహసీల్దార్లకు మార్గదర్శకాలు జారీచేసింది.
పాస్‌పుస్తకం రాని రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌ ఇస్తే రైతుబంధు చెక్కుఇవ్వాలని అధికారులకు స్పష్టంచేసింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే గ్రామాలకు వచ్చిన రెవెన్యూబృందాలకు రైతులు తమ ఆధార్‌కార్డు కాపీలను అందజేశారు. అయితే పలు సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల ఖాతాలకు ఆధార్‌ సీడింగ్‌ జరుగలేదు. రైతుల ఖాతాలో సాగుభూముల వివరాలు సరిగానే ఉన్నప్పటికీ ఆధార్‌ సీడింగ్‌ లేకపోవడంతో ఫొటోలు వారి ఖాతాకు లింక్‌ కాలేదు. దీంతో పాస్‌ పుస్తకం ముద్రణ జరుగలేదు. పాస్‌బుక్‌ ముద్రణ కాలేదన్న కారణంతో పెట్టుబడి చెక్కులు నిలిపివేయడం మంచిది కాదని భావించిన ప్రభుత్వం ఖాతానంబర్‌, ఆధార్‌ కార్డు జీరాక్స్‌ ఇస్తే చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అలాంటివాటిని తహసీల్దార్‌ ధ్రువీకరించిన తరువాత చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే ఆటవీ హక్కు పాస్‌పుస్తకం ఉన్న గిరిజన రైతులకు కూడా పెట్టుబడి చెక్కులు అందజేస్తారు. /ూష్ట్రంలోని భూములు సాగుచేస్తున్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి వందరోజుల్లో దానిని పూర్తిచేసింది. 58.34 లక్షల మంది రైతుల వద్ద 1.43 కోట్ల సాగు భూమి ఉందని తేల్చింది. ఈ భూమికి ఎకరానికి 4 వేల చొప్పున మొత్తం రూ.5,720 కోట్ల పెట్టుబడి సొమ్ము అందజేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.6,000 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులోభాగంగా మొదటిదశ లో రూ.1,602 కోట్లు, రెండోదశలో రూ.2,455 కోట్లు బ్యాంకులకు అందజేసింది. మిగతా మొత్తాన్ని కూడా మే 10 నాటికి బ్యాంకుల్లో జమచేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని 10,823 గ్రామాలకుగాను 160 గ్రామాల్లో అసలు సాగుభూమి లేదని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10,663 గ్రామాల్లో పండుగ వాతావరణం మధ్య వారంరోజులపాటు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగనున్నది. ముద్రణ పూర్తయిన పాస్‌ పుస్తకాలు జిల్లాల నుంచి మండలాలకు చేరాయి. వాటిని గ్రామాలవారీగా రైతులకు పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. పంపిణీ సకాలంలో జరుగడానికి వీలుగా ఒక్కో మండలంలో మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇందులో ఒక బృందానికి తహసీల్దార్‌, మిగిలిన రెండు బృందాలకు డిప్యూటీ తహసీల్దార్‌, మండల వ్యవసాయశాఖాధికారి నాయకత్వం వహిస్తారు. ఒక్కో బృందంలో ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరు రైతుల వివరాలు సరిచూసుకుని పాస్‌పుస్తకం, చెక్కును ఒక కవర్‌లో ఉంచి భూ యజమానికి అందజేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటలవరకు, సాయం త్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు గ్రామాల్లో చెక్కులు, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు విధులు ఏ విధంగా నిర్వహించాలనేదానిపై ఆయా బృందాలకు అధికారులు శిక్షణఇచ్చారు.