హైదరాబాద్,మే9(జనం సాక్షి): రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే మూస విధానాల నుంచి లాభాల పంటల వైపు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో క్రాప్కాలనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మన ఆహార అవసరాలకు తగ్గట్టుగా అన్ని పంటలు మన దగ్గరే పండించుకునేలా రాష్ట్రాన్ని క్రాప్‌కాలనీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. సీఎం స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన సూచనలిస్తున్నారు.అవన్నీ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కొన్ని మండలాలను క్రాప్ కాలనీలుగా గుర్తించి కూరగాయలు సాగు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల్ మండలాల్లో మొత్తం 3,500 ఎకరాల్లో కూరగాయలు పండించేలా క్రాప్‌కాలనీలు ఏర్పాటుచేశారు. మరోవైపు మార్కెటింగ్‌శాఖ.. రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొని, తాజా కూరగాయలను తక్కువ ధరకు అందించేలా మన కూరగాయల ఔట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. /ూష్ట్రంలో రైతుల లెక్క, వారి భూముల వివరాలు, ఏపంటలు పండుతున్నాయి.. ఏయే నీటి వనరులు ఉన్నాయి.. ఏ పరికరాలు ఉన్నాయి.. ఆదాయ వనరులేమిటి.. ఇలా సమస్త సమాచారాన్ని సేకరించడం ముఖ్యమనుకున్న ముఖ్యమంత్రి వ్యవసాయశాఖతో రైతు సమగ్ర సర్వే చేయించారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకిలెక్కలు కాకుండా పక్కా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ సమాచారంతో ఇకపై వ్యవసాయరంగంలో సత్ఫలితాలు సాధించే పథకాలు, సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు వీలు కలిగింది. తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో కేవలం 4.175 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాంలు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం ఉండాలన్న లక్ష్యంతో మార్కెటింగ్‌శాఖ రూ.1024.50 కోట్ల నాబార్డు రుణంతో యుద్ధప్రాతిపదికన గోదాంల నిర్మాణం ప్రారంభించింది. మొత్తం 18.30 లక్షల టన్నుల సామర్థ్యంతో 356 గోదాంలను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 310 గోదాంల నిర్మాణం పూర్తయింది. అన్నింటి నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో గోదాంల నిల్వ సామర్థ్యం 22 లక్షల టన్నులకు చేరనుంది. తెలంగాణ రైతు జాతీయస్థాయిలో తన పంటను అమ్ముకునేలా రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) విధానాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నది. ఈ-నామ్ అమలులో నిజామాబాద్ మార్కెట్‌కు గతేడాది ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు సైతం దక్కింది. దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకంలో ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసింది. మహిళలకు ప్రాధాన్యం కల్పించింది.
——————-




