Thursday, 5 November 2026

రైతు మేలు కోసం కొత్త చట్టాలు

హైదరాబాద్ : విత్తన చట్టాలలో మార్పులు, అక్రమాల నియంత్రణకు కొత్త చట్టాలు, విత్తన విధానాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఎనిమిదో జాతీయ విత్తన కాంగ్రెస్ మంగళవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరుగనుంది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో బహుళజాతి విత్తన సంస్థలు రూపొందించిన నూతన వంగడాలు, సాంకేతిక పరికరాలను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు. వీటితోపాటు ప్రముఖ జాతీయ, రాష్ట్ర పరిశోధన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. రైతులు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. నూతన విత్తన చట్టాలు, చట్ట సవరణపై అన్నదాతలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు.

విత్తన చట్టానికి సలహాలు
దేశంలో, రాష్ట్రంలో ఇప్పటికీ 1966 నాటి విత్తన చట్టమే చలామణిలో ఉంది. హైబ్రిడ్ వంగడాలు, జన్యుమార్పిడి వంగడాలతోపాటు బహుళజాతి విత్తన సంస్థలు దేశంలో భారీగా ప్రవేశించాయి. మార్కెట్‌లో రోజుకో కొత్తరకం వంగడం వచ్చి పడుతున్నది. వీటలో నాణ్యమైనవి ఏవో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకే రకాన్ని నానా రకాల పేర్లతో కంపెనీలు విక్రయిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి విడుదలైన రకాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళుతున్నాయన్న అభియోగాలు ఉన్నాయి. ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు ఆధునిక పరిజ్ఞానం మేళవింపుతో ఒక నూతన విత్తన చట్టాన్ని రూపొందించడం అవసరం. అందుకు రాష్ట్రం పరిధిలో ప్రత్యేకంగా విత్తన చట్టం రూపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని సమగ్రమైన, మేలైన విత్తన చట్టాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడగలదని వ్యవసాయశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అవసరమైన 60 శాతం విత్తనాలు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన భాండాగారం చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం. ఇటీవలే రాష్ట్రంలోని విత్తన కంపెనీలతోనూ తెలంగాణలోని మండలాలను దత్తత తీసుకునే ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలోజాతీయ విత్తన కాంగ్రెస్ హైదరాబాద్‌లో జరగడం రాష్ట్ర ప్రభుత్వానికి సువర్ణావకాశం.

రాష్ట్రంలో 84 శాతంపైగా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే కీలకపాత్ర విత్తనానిదే. నాణ్యమైన విత్తనం నాటితే దాదాపు సగం దిగుబడి సాధించినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిసారి కొత్తగా విత్తనం కొనుగోలు చేయటం రైతుకు భారమే. అందుకే విత్తనోత్పత్తిలో రైతులకే శిక్షణనిచ్చి వారి క్షేత్రంలో ఉత్పత్తయ్యే విత్తనాలను స్వయం ధ్రువీకరణ చేసుకునేలా ప్రోత్సహించేందుకు విత్తన విధానాలు రూపొందించనున్నట్టు అధికారులు చెబ్తున్నారు. ప్రతి క్షేత్రంలో ధ్రువీకరణ విత్తనం సాగులో ఉండేలా, తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమయ్యే అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు ఈ జాతీయ సదస్సులో చర్చించనున్నారు.

హాజరుకానున్న ప్రముఖులు
ఈ సదస్సును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నట్టు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సదస్సు జరిగే మూడు రోజులు ఇక్కడే ఉండి పర్యవేక్షించనున్నారు. అమెరికా నుంచి విత్తన పరిశోధకులతో పాటు 800 మందికి పైగా జాతీయస్థాయి నిపుణులు పాల్గొనేందుకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *