Monday, 2 November 2026

రైతు సమితిలు కాదు.. రజాకార్ల సైన్యం

కేసీఆర్‌ పై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాం పాలనా కాలంలో ఉన్నట్లు కేసీఆర్‌ కూడా రజాకార్ల సైన్యాన్ని రైతు సమితి పేరిట తయారు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌ లో విూడియాతో మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రజల్లో సీఎం పరువు పోయిందని, దీన్ని కప్పిపుచ్చడానికి రైతు సమన్వయ సమితిలను తెరపైకి తెచ్చారన్నారు. మన ఊరు మన ప్రణాళిక అంటూ హడావిడి చేశారని, మూడేళ్లు గడుస్తున్నా దిక్కు మొక్కు లేకపోవడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. మన ఊరెటు పోయిందో, మన ప్రణాళిక ఎటు పోయిందో తెలియదు కానీ, ఆ ప్రణాళిక పెట్టిన మంత్రి మాత్రం పక్క శాఖకు వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే చేసి 3 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. అది కూడా బుట్ట దాఖలు చేశారని తెలిపారు. గత దసరాకు ప్రకటించిన కొత్త జిల్లాల విస్తీర్ణం, జనాభా పై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు. కొత్త జిల్లాల వల్ల 20లక్షల జనాభా ఎక్కడికి పోయిందో తెలియడం లేదని విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ లో తిరిగే పని లేని వాళ్లను రైతు కమిటీలలో వేస్తారట.. అని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. వివాదాస్పద భూములన్నింటినీ వాళ్లు రైతులను బెదిరించి వసూళ్లు చేయడానికి ఈ కమిటీలు పనికొస్తయి తప్ప ఇంకోదానికి కాదని ఆరోపించారు. ఇక మండల కమిటీ లో తెరాస గజ దొంగలు ఉంటారన్నారు. రెవెన్యూశాఖ ను నిర్వీర్యం చేసి టీఆర్‌ఎస్‌ లఫంగి గాళ్లను తెరవిూదికి తెస్తున్నారని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. దేవుని భూములను దోచుకున్న జూపల్లి చేతిలో 4 జిల్లాల రైతుల భవిష్యత్తు పెడుతున్నారని ఆరోపించారు. జూపల్లి తప్పుడు కాగితాలతో బ్యాంక్‌ లను నిండా ముంచారని వ్యాఖ్యానించారు. మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని కబ్జా భూములను లీగల్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారులు భయపడి సంతకాలు చేయడం లేదని రైతు సమన్వయ సమితిని

తీసుకొచ్చారన్నారు. తాను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులున్నా, తప్పుడు సమాచారం చెప్పినా కోర్టులో కేసులు వేసుకోవచ్చని ప్రభుత్వానికి రేవంత్‌ సవాల్‌ విసిరారు.