శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 ( జనంసాక్షి): నడిరోడ్డును కబ్జా చేసి యదేచ్చగా అక్రమ నిర్మాణానికి పూనుకోవడమే గాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే కనీస స్పందనకూడా లేదని… తక్షణమే అట్టి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మియాపూర్ డివిజన్ పరిధి డికె ఎన్ క్లేవ్ పరిధి ప్లాట్ నెంబర్ 1,2 యజమాని భాస్కర్ ఫ్లాట్ నెంబర్ 3 యజమాని రామ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి వారు ఓ మెమోరాండం( నెంబర్ జిహెచ్ఎంసి 581 – పిటి) సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ చెరువులు, నాళాలు, మురుగు కాల్వలు, ప్రభుత్వ భూములు ఇలా దేన్ని వదలకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో భూ కబ్జాలు కొనసాగుతూ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని… చివరకు కనీస మౌలిక సౌకర్యాలలో ప్రధాన భూమిక పోషించే రోడ్లను సైతం దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు కబ్జాకోరులు సిద్ధపడుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇలాగే చూస్తూ పోతే ప్రజా అవసరాల కోసం ఉపయోగించే రోడ్లుసైతం దళారుల చెరలో చిక్కి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డికె ఎన్ క్లేవ్ వాసులు తమ రాకపోకలకు, ఇతర అవసరాల కోసం వినియోగించే నడిరోడ్డును ఎన్క్లేవ్ లో ఉండే ప్లాట్ నెంబర్ 7కి సంబంధించిన వ్యక్తులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణానికి పూనుకోవడం జరిగిందన్నారు. సదరు నిర్మాణంవల్ల తమకు జరిగే అన్యాయాన్ని కబ్జాదారులు గుర్తించినప్పటికీ కనీస మానవత్వాన్ని విస్మరించి అడిగేవాడెవడు అన్నచందంగా రోడ్డును కబ్జా చేయడం జరిగిందని, నడిరోడ్డుపై అక్రమ నిర్మాణం వెలిస్తే తాము ఎలా రాకపోకలు సాగించాలని… పక్క ప్రాంతాలకు ఎలా వెళ్లాలని డికె ఎన్ క్లేవ్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి నివేదించడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని ఆయన తమకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మున్ముందు ఇలాంటి అక్రమాలకు చోటు లేకుండా కజ్జాదారులపై కఠినమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
” రోడ్డు కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టండి… చందానగర్ ‘డిసి’ కి డి.కె ఎన్ క్లేవ్ వాసుల మొర”




