– జనచైతన్య యాత్రకు మంచి స్పందన వస్తుందని అభినందన
– జులై 13న రాష్ట్రంలో పర్యటిస్తానని వెల్లడి
హైదరాబాద్, జూన్30(జనం సాక్షి) : తెలంగాణలో భాజపా రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్‌కు శనివారం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జనచైతన్య యాత్ర మంచి సాగుతుందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభినందించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఖరారైనప్పటికీ వాయిదాలు పడుతూ వస్తోంది.. ఈ నెల 22న ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. జన చైతన్య యాత్ర చేపట్టే ముందు అమిత్ షాతో భేటీ అయిన భాజపా రాష్ట్ర నేతలు రాష్ట్రంలో పర్యటించాలని ఆయనను కోరారు. యాత్ర 8వ రోజుకు చేరిన వేళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పోన్ చేసిన అమిత్‌షా జులై 13న రాష్ట్రంలో పర్యటించనున్నట్టు చెప్పారు. ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర పర్యటన ఉంటుందని తెలిపినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. చైతన్య యాత్ర విజయవంతం అవుతుండటంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. 13న జన చైతన్య యాత్రలో తాను కూడా పాల్గొంటానని అమిత్‌షా చెప్పినట్లు లక్ష్మణ్ తెలిపారు. ఇదిలా ఉంటే జనచైతన్య యాత్ర సంగారెడ్డిలో సాగుతుంది. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెరాస హయాంలో ఏఒక్క వర్గ ప్రజల్లోనూ సంతోషం లేదన్నారు. కేవలం మాటలగారడితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ యాత్రలో బీజేపీ నాయకులు రఘునందన్, తదితరులు పాల్గొన్నారు.




