లక్ష్మీనరసింహస్వామికి భక్తుల ప్రత్యేక పూజలు
శివ్వంపేట అక్టోబర్ 2 జనంసాక్షి : అశ్వయుజ మాసాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆదివారం జంట నగరాలతో పాటుగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దేవాలయంలో స్వామివారి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వారు స్వామివారి దేవాలయమున కు ఈశాన్య భాగంలో ఉన్న కోనేరులో పుణ్య స్థానాలు ఆచరించి, స్వామివారికి తలనీళాలు సమర్పించారు. మరికొందరు భక్తులు వారి వారి మొక్కులలో భాగంగా ఒడిబియ్యం పోసీ, వ్రత మండపంలో పెద్ద సంఖ్యలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. మరికొందరు భక్తులు కాలినడక మార్గంలో కొండపైకి చేరుకొని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు దేవస్థాన ప్రధాన అర్చకులు ధనుంజయ శర్మ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విద్యాకర్ చారి సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.