Thursday, 5 November 2026

ల్యాబ్‌ల ఏర్పాటుకు.. 

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సహకారం
కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే కొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తుంది
రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి
హైదరాబాద్‌,జూన్‌23(జ‌నం సాక్షి) : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం జూబ్లీహిల్స్‌ అపోలో మెడికల్‌ కాలేజీలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, అపోలో ఆస్పత్రి సంయుక్తంగా ఇచ్చిన వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌, అపోలో మెడ్‌ స్కిల్స్‌ సీఈవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ పొందిన అభ్యర్థులకు అభినందలు తెలిపారు. వృత్తిలో నైపుణ్యమే కాదు.. జీవితంలో నిలబడే విధంగా ఇక్కడ ఆత్మవిశ్వాసం నింపుతున్నారని పేర్కొన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులు ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బోధనా సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో కొత్త ట్రెండ్స్‌ సృష్టిస్తుందన్నారు. ఎన్నో రాష్ట్రాలు  మన పథకాలు, పాలనపై చర్చిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా కేసీఆర్‌ పక్కా ప్రణాళికతో పథకాలను అమలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలోకి  ఆ పథకాలను అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.