1.23లక్షల ఎకరాల్లో పంట నష్టం
రైతులకు అండగా ఉంటామన్న మంత్రి జోగు
ఆదిలాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): జిల్లాలో తాజాగా కురుస్తున్న వర్షాలకు 403గ్రామాల్లో పంటనష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఏకంగా 1.23లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు మంత్రి జోగురామన్న భరోసా ఇచ్చారు. పంటనష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. వారికి సాయం అందేలా చూస్తానని హావిూ ఇచ్చారు. ప్రభుత్వం పెట్టుబడిసాయం అందించినా.. రైతుకు నిరాశే మిగిలింది. పంట దిగుబడి తక్కువైనా ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఆశతో ఉన్నారు. సోయా, కంది, జొన్న రైతులకు ఇదే తీరున పెట్టుబడి వ్యయం పెరిగి నష్టం చవిచూడక తప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రకృతి పగబట్టినట్లు భారీ వర్షాలు కురియడంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రాథమికంగా రూ.32కోట్ల మేర పంట నష్టం జరిగినట్లుగా భావిస్తుండగా..ఈ నష్టం మరింత భారీగానే ఉంటుందని రైతులు వాపోతున్నారు. వరుసగా కురిసిన భారీవర్షం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది.ఈసారి పత్తి, సోయా, కంది, జొన్న వంటి పంటలను వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 4.90లక్షల ఎకరాల్లో ఆయా పంటలను రైతులు సాగు చేశారు. మద్ధతు ధర అధికంగా ఉంటుందన్న భావనతో రైతులు అత్యధికంగా పత్తి పంటను సాగుచేశారు. ఆదిలోనే
గులాబీ పురుగు నివారణకు రక రకాల మందులు వాడటంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపడయ్యింది. నకిలీ మందులు రావడంతో ఆశించిన రీతిలో పంట కనిపించకపోవడంతో ఖర్చు భారం మరింత పెరిగింది. భీంపూర్, తాంసి, ఆదిలాబాద్ గ్రావిూణం, జైనథ్, బేల మండలాలతోపాటు వాగులు, వంకలు అధికంగా కలిగిన నార్నూరు, ఉట్నూరు, ఇచ్చోడ, బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, ఇంద్రవెళ్లి మండలాల్లో ఎక్కువ నష్టపోయారు. వాగులు, వంకలకు తోడు వరదనీరు కారణంగా క్షేత్రస్థాయిలో అధికారులు అంతటా పంటనష్టం వివరాలు సేకరించలేకపోయారు. రెండు రోజులు గడిస్తే ఈ నష్టం అంచనా మరింత పెరిగే అవకాశముందని ఆశాఖవర్గాలు చెబుతున్నాయి.




