ఊరూవాడ ప్రజల్లో పరీక్షలపై అవగాహన
చైతన్యంతో ముందుకు వస్తున్న జనం
హైదరాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.ఈ నెల 15న సిఎం చేతుల విూదుగా మొదలైన కార్యక్రమం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. మంత్రలు సమన్వయం చేసుకుంటూ పోతున్నారు. కార్పొరేట్ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు ఇస్తుండటంతో జనం మురిసిపోతున్నారు. కంటిచూపు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాల్లో ఉత్సాహంగా కార్యక్రమం సాగుతోందని అన్నారు. జిల్లాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరంలో ప్రజాప్రతినిధులు పాల్గొని పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా రాష్ట్రంలో అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తూ ప్రతి రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని తెలిపారు. అందువే వైద్య శిబిరాలకు జనం భారీగా వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 24 శిబిరాలు నిర్వహించగా 3939 మందికి పరీక్షలు నిర్వహించి, అందులో 1112 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం లోదినూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మెదక్ జిల్లాలో శుక్రవారం 3694 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 262 మందికి అద్దాలను పంపిణీ చేయగా, 427 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్ చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని కంటి వెలుగు ప్రోగ్రాం జేడీ స్వర్ణకుమారి సందర్శించారు. మోటకొండూర్లో ఇప్పటివరకు 320 మందికి పరీక్షలు నిర్వహించి 25 మందికి కంటి అద్దాలు అందజేయగా 50 మందికి ఆపరేషన్ చేయాలని గుర్తించి దవాఖానకు రిఫర్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 2,892మందికి వైద్య పరీక్షలు చేశారు. 503మందికి అద్దాలు అందించి, 492 మందిని ఆపరేషన్లకు రిఫర్ చేశారు.




