హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): విద్యావలంటీర్ల నియామకాలకు సంబంధించి ఈసారి ఇదివరకు ఎన్నడూ లేనంతగా డిమాండ్ ఏర్పడింది. పోస్టలు సంఖ్యను పెంచడంతో పాటు, జీతాలు కూడా డబుల్ చేశారు. ఒక్కో పోస్టుకు దాదాపు 10 మంది పోటీ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల పోస్టులకు నెలకొన్న డిమాండ్ ఇది. ప్రభుత్వం వలంటీర్ల వేతనాలను ఇటీవల 50 శాతం పెంచింది. గడచిన విద్యాసంవత్సరం వరకు నెలకు రూ.8 వేలు చెల్లించగా ఈసారి నుంచి రూ.12 వేలు చెల్లించనున్నారు. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు జిల్లాల్లో వేలాది మంది ఉండగా ఏళ్లు గడుస్తున్నా ఉపాధ్యాయ నియామకాలు జరగకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. కొందరు ప్రైవేట్ పాఠశాల్లలో అత్తెసరు జీతాలకు పనిచేస్తున్నారు. ఇలాంటి వారు కూడా వలంటీర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు దండిగా వసూలు చేస్తున్నా టీచర్లకు మాత్రం అత్తెసరు జీతాలతో సరిపుచ్చుతున్నారని ఆరోపిస్తున్నారు. విధిలేక కొందరు ప్రైవేట్ ద్యాసంస్థల్లో పని చేస్తుండగా… ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నచోట ప్రభుత్వం విద్యావలంటీర్లను నియమించడంతో కొందరు ఆ ఉద్యోగాల్లో చేరేందుకు సిద్దపడుతున్నారు. ఈ యేడు పోస్టులు ఎక్కువగా మంజూరు కావడంతోపాటు, వేతనాలు యాభై శాతం పెరగడంతో బీఎడ్, డీఎడ్ విద్యార్హత ఉన్న అనేకమంది అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేశారు. ఆయా పోస్టుల భర్తీకి విద్యాశాఖ తగిన విద్యార్హతలు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 5వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా అన్ని పోస్టులకు కలిపి ఆన్లైన్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఎందరో నిరుద్యోగ టీచర్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు ఒక్కో పోస్టుకు పది మంది పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్న పాఠశాలల్లో ప్రత్యామ్నాయంగా వలంటీర్లను నియమించే పక్రియ ప్రతిఏటా కొనసాగుతోంది. అయితే విద్యాశాఖ నుంచి అనుమతి రావడం ఆలస్యమవుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యాక రెండు, మూడు నెలల తర్వాత గానీ ఈ పక్రియ ప్రారంభం కావడం లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన, అర్హుల ఎంపిక, నియామక పత్రాల అందజేత తదితర పక్రియ పూర్తయి వలంటీర్లు విధుల్లోకి చేరేసరికి మూడు నెలలకు పైగానే అయ్యేది. అంతవరకు సంబంధిత సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు లేక బడుల్లో బోధన కుంటుపడేది. దీనివల్ల విద్యార్థులకు కలుగుతున్న నష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈసారి ముందస్తుగానే వలంటీర్ల నియామక పక్రియ చేపట్టింది.




