పార్టీ బలప్రదర్శనకు రంగం సిద్దం
హైదరాబాద్,సెప్టెంబర్13(జనంసాక్షి): మిషన్ 2019 దిశగా బిజెపి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. కార్యక్రమాలను చేపట్టడం కన్నా అధికరా పక్షాన్ని నిలదీయడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన నగరాల్లో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా.. ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్న విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టాలని కోరుతూ నిజామాబాద్ వేదికగా సమరశంఖం పూరించనుంది. ఈనెల 17న నగరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించి తెలంగాణ జిల్లాల్లోని క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేందుకు రంగం సిద్ధం చేసింది. అదేరోజు ప్రదాని మోడీ జన్మదినం కావడంతో ఇలా రెండు కార్యక్రమాలను కలిపి ప్రజల్లో పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అమిత్‌షా పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ప్రణాళికాయుతంగా ముందుకెళ్తే తెలంగాణలో గట్టిపోటీ
ఇవ్వవచ్చని భావిస్తున్న కేంద్ర నాయకత్వం విమోచన దినోత్సవాన్ని ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత పుష్కర కాలంగా పోరాడుతున్న కమలనాథులు ఏటా సెప్టెంబరు 17న ఏదో రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు వివిధ జిల్లాల కలెక్టరేట్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు యత్నించారు. తెరాస పాలనాపగ్గాలు చేపట్టాక కూడా విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టపోవడంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న భాజపా ఈసారి భారీ ఎత్తున సన్నాహాలు
చేస్తోంది. నిజామాబాద్ సభకు భారీగా జనాన్ని సవిూకరించి సత్తా చాటాలని భావిస్తోంది. సభ విజయవంతమైతే పార్టీ క్యాడర్లో నూతనోత్తేజం నెలకొంటుందని.. ఇది 2019 ఎన్నికల వరకు ఉపకరిస్తుందని భావిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోఢీ హవాతోకేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలంగాణలో మాత్రం తన పట్టును నిరూపించుకోలేదు. గత ఎన్నికలో టిడిపితో జతకట్టి కేవలం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. నిజానికి ఈ రెండున్నరేళ్లలో బిజెపి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అధికార టిఆర్ఎస్ను మరపించేలా కార్యక్రమాలు చేయలేకపోయింది. టిఆర్ఎస్ను తిడితే బిజెపిని మెచ్చుకుంటారన్న ధోరణి తప్ప మరోటి కాదు. ప్రధాని స్వయంగా ప్రతిపాదించి ప్రచారం చేసిన స్వచ్ఛభారత్ అభాసుపాలవుతోంది. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. విభజన తర్వాత తెలంగాణలో పట్టు సాధించవచ్చనే ఆశలు.. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ముందు ఆవిరయ్యాయి. నిజామాబాద్ సభ విజయవంతమైతే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడంతోపాటు పూర్వ వైభవం సాధించవచ్చని భావిస్తున్న పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే జిల్లాను చుట్టుముట్టారు. ప్రధాన పట్టణాలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించడంతోపాటు జన సవిూకరణకు సూచనలు ఇస్తున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలతో ¬రెత్తిస్తున్నారు. సభను విజయవంతం చేసే బాధ్యతను భుజాన వేసుకున్న పార్టీ నేతలు ఇప్పటికే జిల్లాలో పర్యటించి వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ యాత్ర ద్వారా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇదే క్రమంలో కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి సాధ్వీ పర్యటించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సభలో పాల్గొనడంతోపాటు భాజపా నేతలతో సమావేశం అయ్యారు. ఇక జిల్లా నేతలు, వివిధ మోర్చాల ప్రతినిధులు జిల్లాను చుట్టుముడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా సత్తాచాటేందుకు ప్రణాళిక రచిస్తున్న భాజపా ముందుగా జిల్లాలపై గురి పెట్టింది. దీనికి విమోచనే వ్యూహంగా మార్చుకుంది. వచ్చే ఎన్నికల్లో కమలం విజయం సాధించకుండా ఏ శక్తి ఆపలేదంటూ పార్టీ శ్రేణులకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మార్గదర్శనం ఇవ్వడంతో విమోచనపై ఉద్యమిస్తున్నారు.




