మునగాల, అక్టోబర్ 18(జనంసాక్షి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యాదా రమేష్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆయనను వెంటనే విధుల్లో నుండి తొలగించాలని మునగాల మండల ఎంపిపి ఎలక బిందు నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ స్థానికంగా ఉండకుండా సూర్యాపేట నుంచి వస్తున్నాడని, జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వర్తిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై పదిసార్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలో తన విధులకు గైర్హాజరై తన సొంత ఆసుపత్రిలో ఉండగా పట్టుబడటంతో ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. నెలనెలా ప్రభుత్వం నుండి వేలవేల రూపాయల వేతనాలు తీసుకుంటూ తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా సంపదనే ధ్యేయంగా సొంత ఆసుపత్రిలో వైద్య సేవలు చేస్తున్న వైద్యాధికారి యాదా రమేష్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి విధుల నుంచి తొలగించాలని కోరారు.
*వైద్యాధికారి యాద రమేష్ ను విధులను నుంచి తొలగించాలి*




