Tuesday, 3 November 2026

సత్ఫలితాలు ఇచ్చిన బడిబాట

గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య

హైదరాబాద్‌,జూన్‌29(జనం సాక్షి ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంమంచి ఫలితాలు ఇచ్చిందని అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే బడిబాట ద్వారా విద్యార్థుల చేరిక పెరిగిందిన చెబుతున్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను సైతం సర్కారు బడుల్లో అందుతున్న విద్యాప్రమాణాలు, సౌకర్యాలు తదితర వాటిని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఎన్నడూ లేని విధంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం జిల్లాల్లో సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖమంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వారికి టార్గెట్లు విధించారు. దీంతో ప్రైవేట్‌ స్కూళ్లను వదిలి చాలామంది తమపిల్లలను సర్కార్‌ బడుల్లో చేర్పించారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా పాఠశాలల్లోని విద్యార్థులకు మౌలిక వసతుల మెరుగు కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. అలాగే నాణ్యమైన బోధనను అందించేందుకు పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను సైతందశలవారీగా నిర్వహించారు. ఏటా పాఠ్యపుస్తకాలు విద్యాసంవత్సరం ప్రారంభమైన కొన్ని నెలలకు విద్యార్థులకు అందేవి. కానీ ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఆయా పాఠశాలలకుపాఠ్యపుస్తకాలను చేరవేశారు. వీటితో పాటు విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను సైతం ఆయా పాఠశాలలకే పంపించారు.అలాగే ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టపర్చేందుకు సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నమోదు కోసం విద్యాశాఖ, ఉపాధ్యాయులతో పాటు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు సాగారు. దీంతో చేపట్టిన బడిబాట కార్యక్రమాలతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి సత్ఫలితాలను తెచ్చిపెట్టింది. ప్రైవేట్‌ వారి ఆకర్శణీయమైన ప్రకటనలతో అనేక మంది వాటి వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల ఆదరణ తగ్గుముఖం పడుతూ వచ్చింది. దీంతో సర్కారు బడుల్లో విద్యార్థులు నమోదు కొంత మేర వెనుకబడింది. అయితే సమస్యను గుర్తించి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దీంతో ఉపాధ్యాయులు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇలా అందరినీ భాగస్వామ్యులను చేసి సర్కారు బడుల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు ఒక సవాల్‌గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యాప్రమాణాలు తదితర వాటిని వివరిస్తూ ప్రజల్లో ఛైతన్యం తీసుకొచ్చారు. గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థలు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా ప్రతీ ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నమోదుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొన్నిచోట్ల మూతపడ్డ పాఠశాలలను సైతం తిరిగి పునఃప్రారంభించేందుకు ఆయా గ్రామస్థులు బడులను రక్షించుకున్నారు. గ్రామస్థులు సైతం పూర్తిస్థాయిలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా అందరి సహాయ సహకారాలతో విద్యార్థుల సంఖ్య నమోదు చేపట్టిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలను తెచ్చిపెట్టింది.