Wednesday, 4 November 2026

సర్ధార్ సర్వాయి పాపన్న గొప్ప ఉద్యమకారుడు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జయంతి

మేడ్చల్(జనంసాక్షి):  తెలంగాణాలో సర్ధార్ సర్వాయి పాపన్న గొప్ప ఉద్యమకారుడని ఆయన గోల్కొండ కోటను జయించిన గొప్ప వ్యక్తి అని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి  అన్నారు. గురువారం సర్ధార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి  మాట్లాడుతూ… తెలంగాణ పోరాటంలో అప్పట్లోనే ఉద్యమాన్ని చేసిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న  అన్నారు. గోల్కొండ కోటను జయించి ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉద్యమాల పురిటిగడ్డలో పోరాటాలు చేసిన మహనీయుడు సర్ధార్ సర్వాయి పాపన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో , అడిషనల్ కలెక్టర్ అర్బన్ జాన్ శాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఝాన్సీ, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.