హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న ఓటర్లు పంట రుణాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. సహకార ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రుణాలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. లక్షకు మించి ఉన్న రుణం, వడ్డీని ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి తెలిపారు. రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రూ. లక్ష లోపు రుణం ఉంటే చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సొసైటీ సభ్యులు పోటీ చేసే అభ్యర్థులకు రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. రుణాలు చెల్లించని వారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని పార్థసారధి స్పష్టం చేశారు.




