సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ
గురుకుల పాఠశాలల్లో మంచి భోజనం పెట్టండి
550 మంది విద్యార్థులకు 12 తరగతులు సరిపోతాయా?
పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వండి
పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్న అందని పుస్తకాలు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి
బోనకల్ : బాసర త్రిపుల్ ఐటీతో పాటు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హస్టల్స్ ల్లో మెరుగైన విద్య, నాణ్యమైన పోషకాహారం అందించాలని, మౌళిక వసతులు కల్పించి అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కరించి మానవ వనరులను కాపాడాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలు, హస్టల్స్, ప్రభుత్వ జూనియర్ కళశాలలను స్వయంగా పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన ఆయన చాలా విచారం వ్యక్తం చేశారు. అరకొర సౌకర్యాల మధ్యన 550 మంది బాలికలు ఆపాఠశాలలో పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. గురుకుల పాఠశాలలో మొత్తం 12 గదులు ఉండగా ఆఫీసు కార్యాలయాలు పోను మిగత గదుల్లోనే తరగతులు నిర్వహించడంతో పాటు ఆతరగతి గదుల్లోనే విద్యార్థులు రాత్రి పూట విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకొని ఆవేధన చెందారు. ఒక్కో తరగతి గదిలో 50 మందిమి ఉంటామని, మంచాలు లేకపోవడంతో నేల మీదనే పడుకుంటున్నామని విద్యార్థులు చెప్పారు. గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసిన గదిని స్టోర్ రూంగా మార్చారు. గురుకుల పాఠశాల పరిస్థితులను సయంగా పరిశీలించిన భట్టి విక్రమార్క విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై విచారం వ్యక్తం చేశారు. బోనకల్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో సరైన మౌళిక వసతులు లేనందున ప్రభుత్వం దృష్టి సారించి పక్క భవన నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అప్పటి వరకు 550 మంది విద్యార్థులకు సరిపోయేటువంటి ప్రయివేటు భవనాల్లోకి మార్చి సక్రమంగా గురుకుల పాఠశాలను నిర్వహించాలన్నారు. అరకొర వసతుల కారణంగా బాలికలపై మానసికంగా వత్తిడి పడి వారి జీవితాలను వెంటాడే ప్రమాదం ఉందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తునప్పటికీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, స్టడీ మెటిరియల్ పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. దీనికి విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్షమైన అయ్యి ఉండాలని, లేకుంటే ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమైన ఉండాలన్నారు. ఇటివంటి వాటిపైన ప్రభుత్వం తగిన దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. విద్య, వైద్యానికి సక్రమంగా నిధులు కేటాయిస్తేనే ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు. యాక్షన్ ప్లాన్ రూపొందించామని పేపర్ ప్రకటనలతో కాలం వెలిబుచ్చటం సరికాదని సూచించారు. వీటి నిర్వహణకు వెంటనే నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. బాసర త్రిపుల్ ఐటీతో పాటు రాష్ట్రంలోని సిద్దిపేట, మహాబూబ్ బాద్, మెదక్, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హస్టల్స్ విద్యార్థులు పురుగుల అన్నం తిని ఆస్వస్థతకు గురయ్యారని, వీటిల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టాలన్నారు. సక్రమంగా అన్ని వసతులు కల్పించాలని, నాణ్యమైన పోషకాహారం పెట్టాలని తినే ప్లేట్లను పట్టుకొని విదార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. బాసర త్రిపుల్ ఐటీతో పాటు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హస్టల్స్ ల్లో చదివే విద్యార్థులు రాష్ట్ర మానవ వనరులన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వీరికి పోషకాహార పదర్థాలను అందించి మానసిక వత్తిడి లేనటువంటి వాతావరణంలో ఈ వ్యవస్థలను నిర్మించకపోతే మన వనరులను మనమే కోల్పోయినవారం అవుతామని, వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ జూనియర్ కళశాలలను పర్యటించి వాటి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, కచ్చితంగా ఆసమస్యల పరిష్కారం కొరకై విద్యార్థుల గొంతుకగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వెల్లడించారు.