Friday, 6 November 2026

సీఎం బెదిరింపులకు భయపడేది లేదు

– వేతనాలు పెంచమంటే బెదిరింపులా?
– ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచాలి
– ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మెతప్పదు
– రౌండ్‌టేబుల్‌ సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ రాజిరెడ్డి
హైదరాబాద్‌, మే21(జ‌నం సాక్షి) : ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంపు విషయంలో ప్రభుత్వం వైఖరిని సరికాదని, సీఎం బెదిరింపులకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ రాజిరెడ్డి అన్నారు.  సోమవారం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశమైంది. కార్మికులకు జీతాలు పెంపు, కార్మికుల సమస్యలపై చర్చించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన రాజిరెడ్డి.. వేతనాలు పెంచమంటే సీఎం బెదిరింపులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని వదిలించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల హక్కులు సాధించుకున్నామని అన్నారు. మేధావులు, పొలిటికల్‌ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ వైఖరిపై వారి మద్దతు కూడగడతామన్నారు. అనంతరం టీజేఎంయూ జనరల్‌ సెక్రటరీ హనుమంతు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు వేతనాల పెంపు విషయంలో సీఎం ప్రకటనతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కార్మికుల సమస్యలు, వేతనాల పెంపు తదితర విషయాలపై చర్చించామన్నారు. ఆర్టీసీలో 2011 నుంచి ఇప్పటి వరకు నియామకాలు జరగలేదన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న సీఎం మాటను నిలబెట్టుకోవాలని కోరారు. వేతనాల పెంపు విషయంలో ముఖ్యమంత్రి బెదిరింపులకు గుర్తింపు సంఘం చతికలపడిందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని హనుమంతు హెచ్చరించారు