ఖమ్మం : రాష్ట్రంలో రోజురోజుకూ స్వైన్ ప్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వ్యాధి నివారణ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వైన్ ప్లూతో గత ఏడాది ఆరుగురు, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారని పేర్కొన్నారు.
ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి నివారణపై దృష్టి పెట్టాలని కోరారు. నివారణ చర్యల్లో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో వ్యాధి నిర్థారణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రాథమిక కేంద్రాల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించా రు. స్వైన్ ప్లూ నిర్థారణ కేంద్రం కేవలం రాజధానిలో మాత్రమే ఉందని, ప్రతి రోజూ వేల సంఖ్యలో శాంపిల్స్ రావడంతో వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు రోజులు పడుతోందని, ఈలోగా వారు (వ్యాధిగ్రస్తులు) ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నిర్థారణ కేంద్రాలను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాధి ఉన్నట్టుగా తేలితే ప్రత్యేక బృందాలతో చికిత్స అందించాలని కోరారు. స్వైన్ ప్లూపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.




