హావిూల అమలులో చిత్తశుద్ది ఏదీ

నిరుద్యోగ సమస్యల అలాగే ఉందన్న సున్నం

ఖమ్మం,జూన్‌27(జ‌నం సాక్షి): రాష్ట్ర అభివృద్ధి అంటే సాధారణ సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకోవడం కాదని, నిరుపేద ఆకలి తీర్చి రాష్ట్రంలో రైతుల ఆత్యహత్యలు, కరవులు లేకుండా చేయడమని సీపీఎం నేత, ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. నిరుద్యోగ యువత ఏళ్ల తరపడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అయినా నేటి వరకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం లాక్కున్నారని ఆరోపించారు. గిరిజనులంతా ఏకమై పోడు భూములను సాగుచేయండి.. విూకు సీపీఎం అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. సిఎంకు చిత్తశుద్ది ఉంటే గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. హరితహారం పేరుతో గిరిజనుల భూమల్లో పాగా వేయాలని చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల బతుకులు మారినప్పుడే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యశాఖలో 14వేల వైద్యుల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని నేటి వరకుభర్తీ చేయలేదన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో వైద్యం అందక ప్రజలు 50కిలోవిూటర్ల దూరం వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సరైన రహదారులు, నాణ్యత విద్య కలిగిన ప్రభుత్వ పాఠశాలలు లేక పేద విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకోలేక చదువులు మానివేసి కూలి బాట పడుతున్నారన్నారు.