Thursday, 5 November 2026

హైదరాబాద్‌ టూ బీదర్‌

శంషాబాద్‌లో దిగిన రాహుల్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఉదయమం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటకలోని బీదర్‌కు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు కాన్వాయ్‌గా రానున్నారు. క్లాసిక్‌ కన్వెన్షన్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో రాహుల్‌ గాంధీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎస్‌పిజి దీనిని తమ ఆధీనంలోకి తీసుకుంది. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు శంషాబాద్‌ చేరుకున్నారు. పోలీసులు బారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే క్లాసిక్‌ కన్వెన్షన్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల హడావిడి కనిపించింది. రాహుల్‌ను కలుసుకోవాలని పలువురు ఇక్కడికి చేరుకున్నారు. ఇకపోతే తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన.. సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుట్టిస్తోందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మరోమారు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్ర లేకుంటే.. 2013లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్‌తో కలిసి కుటుంబసమేతంగా సోనియాగాంధీని కలిసి ధన్యవాదాలు ఎందుకు చెప్పారో వివరించాలని టిఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. కాంగ్రెస్‌ పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా అని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్న కృతజ్ఞతతో రాహుల్‌కు స్వాగతం చెప్పాల్సింది పోయి.. ప్రధాని మోదీ మెప్పు కోసం విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ధన్యవాదాలు తెలిపిన నోటితోనే రాహుల్‌ పర్యటనను విమర్శించడం సరికాదని హితవు పలికారు. విూరు చేస్తున్న కుట్రలన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని టీఆర్‌ఎస్‌ను హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను మాట్లాడనివ్వలేదన్న కక్షతోనే వీసీపై నెపాన్ని నెడుతూ ఓయూలో రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.