Monday, 2 November 2026

హైదరాబాద్ మొద‌టి కీలక మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో కీలక పనులు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. నాగోల్ టూ అమీర్ పేట్, మియాపూర్ టూ అమీర్ పేట్ రూట్లల్లో మేజర్ పనులు స్పీడప్ అయ్యాయి. రెండు రోజులుగా మెట్టుగూడ టూ బేగంపేట్ 9 కిలోమీటర్ల టెస్ట్ రన్ జరుగుతోంది. మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్, నాగోల్ టూ మెట్టుగూడా ట్రయల్ రన్స్ రెండేళ్లుగా నడుస్తున్నాయి. మొత్తం 30 కిలోమీటర్ల ఫస్ట్ ఫేజ్ మెట్రో స్ట్రెచ్ లో మెట్టుగూడ టూ బేగంపేట్ కీలక టెస్ట్ రన్ ప్రారంభం కావడంతో నవంబర్ వరకు ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి నవంబర్ 15 లోగా సెంట్రల్ రైల్వే నుంచి సేఫ్టీ సర్టిఫికెట్ వస్తుందని చెబుతున్నారు మెట్రో అధికారులు.

మరోవైపు మెట్రోను గ్రీన్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దేందుకు పాదచారుల ఏరియాలో బ్యూటిఫికేషన్ పనులు చేస్తున్నారు. మెట్రో స్టేషన్స్, పిల్లర్స్ మధ్యలో కలర్ ఫుల్ మొక్కలతో నింపేస్తున్నారు. నవంబర్ చివరి నాటికి మెట్రోను ప్రధానితో ప్రారంభించాలనే లక్ష్యంతో..  సెక్యూరిటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీస్ అధికారులు. ఇప్పటికే నగర కమీషనర్లు మియాపూర్ మెట్రో స్టేషన్ వర్క్ డెవలప్ మెంట్స్ ను పరిశీలించారు. మెట్రో ఫస్ట్ ఫేజ్ లో కీలకమైన మైత్రివనం ఇంటర్ చేంజ్ స్టేషన్ పనులు కూడా స్పీడప్ చేశారు అధికారులు. మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ 12 కిలోమీటర్లు, నాగోల్ టూ బేగంపేట్ 16 కిలోమీటర్లు మాత్రమే ట్రయల్ రన్ నడుస్తున్నాయి. మిగతా 2 కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ  2కిలోమీటర్లు అందుబాటులోకి రాకున్నా… మెట్రో ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు.

ఉప్పల్, సికింద్రాబాద్ నుంచి, హైటెక్స్, మియాపూర్ కి వెళ్లే ప్రయాణికులు మెట్రో దిగి… బేగంపేట్ లోని MMTS ట్రైన్ ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ పనులు పూర్తయితే 30 కిలోమీటర్ల మొత్తం స్ట్రెచ్ ను జనం వినియోగించుకోవచ్చు. 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడక్కడా పనులకు ఆటకం కలుగుతోంది. మెట్రో రైలు ఎప్పుడు ఎక్కుదామని ఎదురుచూస్తున్న సిటీ జనం కల మరో నెలన్నరలో తీరబోతోంది.  వారం పదిరోజుల్లో మెట్రో టికెట్ రేట్స్ పై ఎల్ అండ్ టీ సంస్థ తమ నివేదికను ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే దేశంలోని వివిధ సిటీల్లో నడుస్తున్న మెట్రో టికెట్ ఫేయిర్ లతో పోలిస్తే కొంత తక్కువగానే టికెట్స్ అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.