హైదరాబాద్ లో అల్లర్లకు సీఎం ప్లాన్

 

* కవిత లిక్కర్ స్కాం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యూహం
* సీఎం డైరెక్షన్ తో ప్రజా సంగ్రామ యాత్రకు ఆటంకం
* బయటికి వస్తున్న కెసిఆర్ చీకటి దందాలు
* అమరుల చితి మంటపై కూర్చున్న కేసీఆర్
* అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగదు
* నిరసన దీక్ష లో బిజెపి స్టేట్ చీఫ్  బండి సంజయ్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ లో మత ఘర్షణలు లేవనెత్తడానికి కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తన బిడ్డ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్  కుట్రకు తెరదీశాడని అన్నారు. తన బిడ్డను కాపాడుకునేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేయించి అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా రాళ్లు, రాడ్లు విసిరినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను బొంద పెట్టే వరకు పాదయాత్ర కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటించారు. అందులో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27న జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్భంధాలపై బుధవారం కరీంనగర్ లోని తన నివాసంలో బండి సంజయ్  నిరసన దీక్ష చేపట్టినట్టు పేర్కొన్నారు. రెండు గంటలపాటు జరిగిన దీక్షలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్, జిల్లా అధ్యక్షులు గంగిడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి  డైరెక్షన్ లోనే ప్రజా సంగ్రామ యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మాపై దాడులు భరించినం ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు అన్నారు. ప్రజలను కలవాల్సిన సీఎం, పేదల బాధలు తెలుసుకుని భరోసా ఇవ్వాల్సిన సీఎం ఫాంహౌజ్, ప్రగతి భవన్ లో సేద దీరుతున్నరు అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పార్టీగా బీజపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామే తప్ప ఎవరినో రెచ్చగొట్టడానికో కాదు అన్నారు. సీఎం కుటుంబంపై లిక్కర్ స్కాం ఆరోపణలొస్తున్న నేపథ్యంలో దారి మళ్లించడానికే పాదయాత్రను అడ్డుకున్నరు అన్నారు. ఇది ప్రజందరికీ అర్ధమైంది అని పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలు, డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఎంతటి దారుణంగా ఉంటాయో కేసీఆర్ ను చూస్తే అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో ఏ దందాలు చూసినా కేసీఆర్ కుటుంబానివే. ఇసుక, మైనింగ్, వైన్స్, రియల్ ఎస్టేట్ దందాలన్నీ వాళ్లవే అన్నారు. చివరకు పత్తాల దందా కూడా వాళ్లదే అని ఎద్దేవా చేశారు. 1400 మంది తెలంగాణ అమరుల చితిమంటల పై కూర్చున్నాడని మండిపడ్డారు. ఎంఐఎం గూండాలను ఆపే ప్రయత్నం చేయడం లేదు. పోలీసుల చేతులు కట్టి వేశారని ఆక్రోశించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎం కుటుంబమే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోంది అన్నారు. టీఆర్ఎస్ నేతలను పిలిచి రాళ్లు, రాడ్లతో బీజేపీ నేతలపై దాడులు చేయిస్తూ బరితెగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమితరిమి కొట్టే వరకు బీజేపీ కార్యకర్తలకు విశ్రమించే ప్రసక్తే లేదు అన్నారు. మీ అక్రమ దందాలను పశ్ర్నిస్తే దాడులు చేస్తామని హెచ్చరించడానికా? దాడులు చేయిస్తోంది ప్రజలు తిరగబడుతున్నా కేసీఆర్ లో మార్పు రావడం లేదు అన్నారు.  ఈనెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నం. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారు అని తెలిపారు. నిరసన దీక్షను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల నుండి బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు