ఫ్రీ కాదండి బాబోయ్‌.. కిలో మటన్‌ రూ.900!

పండుగ వేళ సామాన్యుడిపై ధరల భారం.. గంభీరావుపేటలో మటన్‌ ధరపై ప్రజల అసహనం

గంభీరావుపేట అక్టోబర్ 10 జనం సాక్షి ;

పండుగ పూట మటన్‌ కొనాలంటే సామాన్యుడు జేబు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఓ మటన్‌ షాపులో కిలో మటన్‌ రూ.900కు విక్రయిస్తుండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కిలో మటన్‌ రూ.500 నుంచి రూ.600 వరకు, అదే మండలంలోని ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.800కు విక్రయిస్తుండగా, ఇక్కడ మాత్రం రూ.900 వసూలు చేయడంపై వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

రోజంతా కష్టపడితే రూ.300.. మటన్‌ కిలో రూ.900!

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు పండుగ పూట మాంసం కొనడం భారంగా మారింది. రోజంతా కూలి పనులు చేస్తే రూ.300 నుంచి రూ.400 వరకు మాత్రమే సంపాదించే కూలీలు, కిలో మటన్‌ కోసం రూ.900 చెల్లించాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. పండుగ పూట కనీసం మటన్‌ ముక్కలు కొనుక్కోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

మటన్‌ ధరల విషయంలో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మాంసం విక్రయించే దుకాణాల్లో పరిశుభ్రత, మేకల ఆరోగ్య పరీక్షలు, మాంసం నాణ్యత వంటి అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తనిఖీలు జరుగుతున్నాయా లేదా అన్నదానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి

ఒకే మండలంలో మటన్‌ ధరల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మటన్‌ ధరలపై అధికారులు విచారణ జరిపి, విక్రయ ధరల విషయంలో పారదర్శకత ఉండేలా చూడాలని కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు ఉంటే సంబంధిత దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.