Tuesday, 3 November 2026

తెలంగాణలో పరివర్తన యాత్ర చేస్తాం

– నెలలో ఒకరోజు దళితవాడల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు
– జూన్‌లో తెలంగాణలో అమిత్‌షా పర్యటన
– 2019లో విజయానికి మార్గం సుగమం చేసుకుంటాం
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌
హైదరాబాద్‌, మే29(జ‌నం సాక్షి) : తెలంగాణలో త్వరలో పరివర్తన యాత్రను చేపడతామని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నెలలో ఒకరోజు దళితవాడల్లో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటి… 2019 శాసనసభ ఎన్నికల విజయానికి మార్గం సుగమం చేసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను లక్ష్మణ్‌ వెల్లడించారు. తెరాస పరిపాలనపై ఛార్జిషీట్‌ రూపొందించి… ప్రజల్లో చర్చకు పెడతామని తెలిపారు. జోనల్‌ వ్యవస్థపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్న లక్ష్మణ్‌…. ఈ అంశంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించలేదని మండిపడ్డారు. జోనల్‌ వ్యవస్థతో పాటు భూరికార్డుల ప్రక్షాళనలోనూ లోపాలు ఉన్నాయని విమర్శించారు. జూన్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా… పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. రాష్ట్రంలో రోడ్డుప్రమాదాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లక్ష్మణ్‌ విరుచుకుపడ్డారు.