వినాయక శోభయాత్రలో యువకుడిపై దాడి.. గొంతు కోసే యత్నం


మాడుగులపల్లి, సెప్టెంబర్ 23 ( జనం సాక్షి): నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసి, గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి కుక్కడం గ్రామంలో వినాయక నిమజ్జన శోభయాత్ర వైభవంగా సాగుతోంది ఊరేగింపు గ్రామంలోని బస్టాండ్ సమీపానికి చేరుకోగానే, పోతపాక సాయి అనే యువకుడిపై కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు తీవ్ర ఆవేశంతో సాయి గొంతు కోసేందుకు యత్నించడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే రక్తపుమడుగులో ఉన్న సాయిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందా? లేక శోభయాత్రలో తలఎత్తిన గొడవల వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



